జైలు నుంచే ఎక్కువ సీట్లు గెల్చుకున్న ఇమ్రాన్ ఖాన్

పొరుగుదేశం పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల్లో ఊహించన ఫలితాలు వెలువడ్డాయి. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. బలపరిచిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు 98 చోట్ల సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. 
 
69 సీట్లతో మూడుసార్లు ప్రధానిగా చేసిన నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌)- పీఎంఎల్‌-ఎన్‌ రెండో స్థానంలో, 51 సీట్లతో బిలావల్ భుట్టో జర్దారీ నాయకత్వంలోని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నిలిచింది.  మొత్తం 336 సీట్లున్న పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీలో 266 మంది ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మిగతా 70 స్థానాలను మైనారిటీలు, మహిళలను నామినేట్ చేసి భర్తీ చేస్తారు. 

ప్రస్తుతం ఒక స్థానంలో అభ్యర్థి మరణించడంతో 265 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ప్రభుత్వం ఏర్పాటుకు సాధారణ మెజార్టీ 133. ఇప్పటి వరకూ 260 స్థానాల ఫలితాలను పాక్ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇమ్రాన్‌ బలపరిచిన అభ్యర్థులు 98, పీఎంఎల్‌-ఎన్‌ 69, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) 51, ఇతర చిన్న పార్టీలు 20 స్థానాల్లో గెలుపొందాయి. దీంతో అధికారం కోసం మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మిగతా పార్టీలు, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇమ్రాన్ ఖాన్‌ను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించి, పీటీఐ ఎన్నికల గుర్తు బ్యాట్‌ను పాక్ ఎన్నికల సంఘం రద్దుచేసింది. దీంతో పీటీఐ తరఫున నేరుగా అభ్యర్థులు పోటీచేయకుండా స్వతంత్రులుగా నామినేషన్ వేసి ఎన్నికల్లో నిలిచారు. అయితే, యువ ఓటర్లు ఇమ్రాన్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా నిలిచారు.
 జైల్లో ఉండటం వల్ల ప్రత్యక్షంగా ఇమ్రాన్ ప్రచారం నిర్వహించలేకపోయారు. సామాజిక మాధ్యమాలు, ఏఐ వంటి సాంకేతికత సాయంతో ప్రచారం నిర్వహించారు. కానీ, ఈ ప్రయత్నాలకు కూడా ఆటంకం కలిగించారు. అయినా,  సైన్యం మద్దతు ఉందని భావిస్తోన్న మరో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పార్టీ ముస్లిం లీగ్-ఎన్ ప్రదర్శన పేలవంగా ఉంది. 
దీంతో కొత్త ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి పాకిస్థాన్ సైన్యం వేసిన ఎత్తుగడలు పూర్తిగా విఫలమయ్యాయి. దాదాపు రెండేళ్ల కిందట అవిశ్వాస తీర్మానంతో పదవీచిత్యుడైన ఇమ్రాన్ ఖాన్‌ పలు అవినీతి కేసులను ఎదుర్కొన్నారు. ఈ కేసుల్లో అరెస్ట్ చేసి జైలుకు పంపగా ఎన్నికలకు వారం రోజుల ముందే రెండు కేసుల్లో 20 ఏళ్లు శిక్షపడింది.
 
ఇక, ప్రవాసం ముగించుకుని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జాతీయ ఎన్నికల సమయానికి తిరిగి పాకిస్థాన్‌కు వచ్చారు. ఇవన్నీ సైన్యం కనుసన్నల్లోనే జరిగాయని భావిస్తున్నారు. మరోవైపు, తమ పార్టీకి మెజార్టీ రాకపోయినప్పటికీ, తమదే విజయమంటూ నవాజ్‌ షరీఫ్‌ పేర్కొన్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో ఉన్న పాకిస్థాన్‌ పునర్నిర్మాణానికి విపక్ష పార్టీలు కలిసి రావాలని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ పిలుపునిచ్చారు.

ఓ వైపు పాక్‌లో రాజకీయ, ఆర్థిక సంక్షోభం.. ఆ తర్వాత ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు, హింసాత్మక సంఘటనలు ఎక్కువైన వేళ.. నేషనల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో తీవ్ర హింస తలెత్తింది. ఈ క్రమంలోనే పాక్ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వీటికి సంబంధించిన కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం సంచలనంగా మారింది.

మరోవైపు.. పాక్ ఎన్నికల్లో సైన్యం జోక్యం చేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడిందని.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తలు, నేతలు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేయగా.. సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా వందలాది మంది గాయాలపాలయ్యారు.