రామకృష్ణ మఠంలో స్వర్ణోత్సవ సంబరాలు

రామకృష్ణ మఠం 50 వసంతాలు పూర్తి చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని బేలూర్ మఠానికి అనుబంధంగా భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి. భాగ్యనగరంలో 1973లో రామకృష్ణ మఠం స్థాపించారు. దోమల్‌గూడలో ఉన్న ఈ మఠం 2023 డిసెంబర్‌లో 50 సంవత్సరాలను పూర్తి చేసుకుని స్వర్ణోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమయింది. 
 
స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస, శారదాదేవి, స్వామి వివేకానంద  మూర్తిత్రయం ఆదర్శాలతో ప్రపంచ వేదికలపై భారతీయతను చాటుతున్న మహోన్నత సేవా సంస్థ రామకృష్ణ మఠం. 
 
మానవసేవే మాధవ సేవగా ఇటు ఆధ్యాత్మిక సౌరభాలను, అటు సామాజిక సేవను నలుదిశలా వ్యాప్త చేస్తోంది. స్వర్ణోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శ్రీశ్రీ చండీ హోమం, భజనలు, మ్యూజిక్ కన్సార్ట్, బహిరంగ సభ వంటి ఈ ఆధ్యాత్మిక సంబరాల్లో పాల్గొనాల్సిందిగా హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షులు బోధమయానంద పిలుపునిచ్చారు.