ప్రతి కుటుంబం వేగవంతమైన డిజిటల్ అనుసరణ అవకాశాల ద్వారా వచ్చే ప్రయోజనం పొందేందుకు ఒక సార్వజనీన సమగ్ర డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేస్తామని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. శాసన సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ హైదరాబాద్‌ను కృత్రిమ మేధస్సుకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొంటూ 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆమె తెలిపారు.
రూ.2 వేల కోట్ల వ్యయంతో రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మార్చనుందని, రాష్ట్రంలో నైపుణ్య విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తుందని ఆమె చెప్పారు. వేగంగా మారుతున్న జాబ్ మార్కెట్ డిమాండ్లకు అనుగుణంగా అవసరమైన పరిజ్ఞానం, నైపుణ్యంతో యువతను సన్నద్ధం చేస్తూ ఇవి ప్రతిభా కేంద్రాలుగా పనిచేస్తాయని తెలిపారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి కోసం ఆరు గ్యారంటీలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అందులో రెండు గ్యారంటీలను ఇప్పటికే అమలు చేశామని చెప్పారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే 15 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సదుపాయాన్ని ఉపయోగించుకున్నారని చెబుతూ త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తుందని తెలిపారు.
మహాలక్ష్మి పథకం కింద అర్హులైన కుటుంబాలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌ను అందిస్తామని వెల్లడించారు. కొత్తగా ఏర్పాటు చేసిన టీఎస్‌పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆమె ప్రకటించారు. పాలమూరు- రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టల నుంచి విద్యారంగం వరకు తెలంగాణలోని వివిధ రంగాలు తమ భవిష్యత్ ప్రణాళికలో ఉన్నాయని ఆమె వివరించారు. నూతన ఎంఎస్‌ఎంఈ విధానాన్ని తీసుకురావడంతోపాటు ఎంఎస్‌ఎంఈలకు సహాయపడటానికి, వారి ఇబ్బందులను నివారించడానికి ఒక ప్రత్యేక సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఐటీ, ఫార్మా వంటి రంగాలకు ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని చెబుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో భాగంగా రూ.40 వేల కోట్ల ఒప్పందాలు జరిగాయని గవర్నర్ చెప్పారు.
అధిక డిమాండ్ అవసరాలను తీర్చడానికి హరిత ఇంధనం అంటే సౌర, పవన, హైబ్రిడ్‌తోపాటు నిల్వ ఇంధనం వంటి అన్ని రకాల హరిత ఇంధనాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక సమగ్ర ‘ఇంధన పాలసీ’తో ముందుకు రానుందని గవర్నర్ చెప్పారు. హరిత ఇంధనం వాటాను గణనీయంగా మెరుగుపరిచి, 2030 సంవత్సరం నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ఆమె ప్రకటించారు.
More Stories
అరుంధతి నగర్ లో ఇళ్ల కూల్చివేతపై ఈటెల ఆగ్రహం
భారతీయులందరూ సంస్కృత భాష నేర్చుకోవాలి
సికింద్రాబాద్ నుంచి మహా కుంభమేళాకు ప్రత్యేక రైలు