వీక్షణం వేణుగోపాల్ ఇంటితో సహా ఎన్‌ఐఏ సోదాలు

వీక్షణం వేణుగోపాల్ ఇంటితో సహా ఎన్‌ఐఏ సోదాలు
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో వీక్షణం పత్రిక సంపాదకుడు వేణుగోపాల్‌ నివాసంలో ఎన్‌ఐఏ సోదాలు జరుపుతోంది. వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్‌బినగర్‌లో రవి శర్మ ఇంట్లోనూ ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేపట్టారు.
 
మహారాష్ట్ర పూణే పోలీసులు నమోదు చేసిన కేసులో రాజద్రోహం అభియోగాలు ఎదుర్కొంటున్న విప్లవ కవి వరవరరావుకు వేణుగోపాల్ అల్లుడు అవుతారు. మావోయిస్టు ఉద్యమానికి సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఆయన నివాసంలో సోదాలు దర్యాప్తు జరుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2018లో పుణే సమీపంలో భీమా కోరేగావ్‌లో హింస ప్రేరేపించినందుకు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో గతంలో వరవరరావు అరెస్ట్ అయ్యారు. 
 
 హిమాయత్‌ నగర్‌, ఎల్‌బి నగర్‌లోని పలు ప్రాంతాల్లో న్యాయవాదులు, హక్కుల కార్యకర్తల నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరుగుతున్నాయి.
గత ఏడాది అక్టోబర్‌లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఏ విస్తృత సోదాలు నిర్వహించింది.  పౌర హక్కుల సంఘాలు, మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో పలువురి ఇళ్ళలో తనిఖీలు నిర్వహించారు.