నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌ చంద్ర పవార్ గా కొత్త పార్టీ

ఎన్సీపీకి చెందిన శరద్‌ పవార్‌ వర్గం కొత్త పార్టీ పేరు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌ చంద్ర పవార్. ఈ నెలలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల కోసం ఆ వర్గం సూచించిన ఈ పేరును ఎన్నికల సంఘం (ఈసీ) ఖరారు చేసింది.

 ఈసీ కోరిన మేరకు మూడు కొత్త పార్టీ పేర్లు, మూడు గుర్తులను శరద్‌ పవార్‌ వర్గం సూచించింది. ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌ చంద్ర పవార్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్‌రావు పవార్, ఎన్సీపీ- శరద్ పవార్’ పేర్లను ప్రతిపాదించింది. అలాగే టీ కప్పు, పొద్దుతిరుగుడు పువ్వు, ఉదయించే సూర్యుడు గుర్తులు పరిశీలించాలని ఈసీని కోరినట్లు శరద్‌ పవార్‌ వర్గం పేర్కొంది.

కాగా, ఎన్సీపీలో తిరుగుబాటు చేసి బీజేపీ, షిండే ప్రభుత్వంలో చేరిన శరద్‌ పవార్‌ అబ్బాయ్‌ అజిత్‌ పవార్‌ వర్గానికి అనుకూలంగాఎన్నికల సంఘం (ఈసీ) మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆయన వర్గమే అసలైన ఎన్సీపీ అని ప్రకటించింది. ఎన్సీపీ ఎన్నికల గుర్తు గడియారం కూడా అజిత్‌ పవార్‌ వర్గానికి చెందుతుందని పేర్కొంది.

మరోవైపు ఫిబ్రవరి నెలాఖరులో రాజ్యసభ ఎన్నికలతోపాటు త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త పార్టీ పేరు, ఎన్నికల గుర్తును ఎంచుకోవాలని శరద్‌ పవార్‌ వర్గాన్ని ఈసీ కోరింది. బుధవారం సాయంత్రం 3 గంటలలోగా మూడు పార్టీల పేర్లు, గుర్తుల ప్రతిపాదనలు పంపాలని సూచించింది. అయితే అజిత్‌ వర్గానికే ఎన్సీపీ చెందుతుందన్న ఈసీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని శరద్‌ పవార్‌ వర్గం భావిస్తున్నది.