కాంగ్రెస్ అవుట్‌డేటెడ్ పార్టీ

ఆలోచనల్లో కాంగ్రెస్ పార్టీ అవుట్‌డేటెడ్ అయిందని, అందుకే అవుట్ సోర్సింగ్ ఇస్తోందని అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా రావని పశ్చిమబెంగాల్‌లోని ఒక పార్టీ సవాలు చేసిందని గుర్తుచేశారు.  బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంపైం ధన్యవాద తీర్మానంపై చర్చకు రాజ్యసభలో ప్రధాని బుధవారంనాడు సమాధానమిస్తూ,  కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్వయంగా బీజేపీకి 400కి పైగా సీట్లు వస్తాయని ఆశీర్వదించారని నవ్వుతూ మోదీ చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని, పత్రికా స్వేచ్ఛ‌ను కాంగ్రెస్ మంట‌గిలిపిందని, ఉత్త‌రం, ద‌క్షిణం పేరుతో ప్ర‌జ‌ల్ని విడ‌దీస్తోంద‌ని ప్రధాని మండిపడ్డారు. విప‌క్షాల దుస్థ‌తికి కాంగ్రెస్ కార‌ణం అయ్యింద‌ని చెబుతూ  ఫెడ‌ర‌లిజం గురించి కాంగ్రెస్ పార్టీ ప్ర‌వ‌చ‌నాలు చెబుతుందని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.
 
మ‌న దేశ‌ భూభాగాన్ని భారీ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ శ‌త్రు దేశాల‌కు అప్ప‌గించింద‌ని ప్ర‌ధాని మోదీ  ఆరోపించారు. దేశ సైనిక ద‌ళాల‌ను కాంగ్రెస్ పార్టీ ఆధునీక‌రించ‌లేద‌ని, అలాంటి పార్టీ జాతీయ భ‌ద్ర‌త‌, అంత‌ర్గ‌త భ‌ద్ర‌త గురించి మాట్లాడుతుందా? అని ఆయ‌న ప్రశ్నించారు. స్వాతంత్య్రం అనంత‌రం ప‌రిశ్ర‌మ‌లు అవ‌స‌ర‌మా లేక వ్య‌వ‌సాయం అవ‌స‌ర‌మా అన్న విష‌యంలో కాంగ్రెస్ పార్టీ అయోమ‌యంలో ప‌డింద‌ని విమర్శించారు. 
 
జాతీయ‌వాదం కావాలా లేక ప్రైవేటీక‌ర‌ణ కావాల‌న్న అంశాన్ని కూడా ఆ పార్టీ తేల్చుకోలేక‌పోయింద‌ని చెప్పారు. భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను కాంగ్రెస్ పార్టీ ప‌దేళ్ల‌లో 12వ స్థానం నుంచి 11వ స్థానానికి తీసుకువ‌చ్చింద‌ని, కానీ త‌మ పార్టీ ప‌దేళ్లలో అయిద‌వ స్థానానికి తీసుకువ‌చ్చింద‌ని ప్రధాని గుర్తు చేశారు.  రిజ‌ర్వేష‌న్ల‌కు నెహ్రూ వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. 
 
దేశ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో ఆనాటి సీఎంల‌కు నెహ్రూ ఓ లేఖ రాశారని చెబుతూ  ఆ లేఖ‌కు చెందిన త‌ర్జుమాను వినిపిస్తున్న‌ట్లు మోదీ తెలిపారు. ఉద్యోగాల్లో ఎటువంటి రిజ‌ర్వేష‌న్ల‌ను తాను ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని నెహ్రూ పేర్కొన్న‌ట్లు గుర్తు చేశారు. అస‌మ‌ర్థ‌త‌కు, ప్ర‌మాణాల స్థాయి ప‌డిపోయే అవ‌కాశం ఉండే రిజ‌ర్వేష‌న్ల విధానాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ట్లు నెహ్రూ ఆ లేఖ‌లో పేర్కొన్న‌ట్లు చెప్పారు. 
 
పుట్టుక నుంచి నెహ్రూ కుటుంబం రిజ‌ర్వేష‌న్ల‌కు వ్య‌తిరేకం అంటూ ప్రధాని మండిపడ్డారు. ఒక‌వేళ అప్ప‌ట్లోనే ప్ర‌భుత్వం రిక్రూట్మెంట్ చేసి ఎప్ప‌టిక‌ప్ప‌టి ప్ర‌మోష‌న్లు ఇస్తే, ఇప్పుడు వాళ్ల స్థాయిలో ఎక్క‌డో ఉండేద‌ని మోదీ తెలిపారు.
ఓబీసీల‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌లేద‌ని, జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీలో ఉన్న పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్ ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. 
 
బాబా సాహెబ్ అంబేద్క‌ర్‌కు భార‌త ర‌త్న ఇచ్చేందుకు వెనుకాడింద‌ని మోదీ ధ్వజమెత్తారు. కేవ‌లం త‌మ కుటుంబ‌స‌భ్యుల‌కు మాత్ర‌మే భార‌త ర‌త్న ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింద‌ని తెలిపారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ త‌మ‌కు సామాజిక న్యాయం గురించి పాఠాలు చెబుతోంద‌ని ప్రధాని ఎద్దేవా చేశారు. లీడ‌ర్‌గా ఉండే గ్యారెంటీ లేని వ్య‌క్తి మోదీ గ్యారెంటీ గురించి ప్ర‌శ్నిస్తున్నార‌ని విమ‌ర్శించారు.
 
బ్రిటిష్ వారు ఆ పార్టీకి స్ఫూర్తి అని చెబుతూ బ్రిటిషన్ వారి బానిసత్వ చిహ్నాలను దశాబ్దాల పాటు కొనసాగించారని ప్రధాని విమర్శించారు. దేశాన్ని కష్టకాలం నుంచి తమ ప్రభుత్వం బయటకు తెచ్చిందని, సమస్యలను అధిగమించామని పేర్కొన్నారు. భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రసంగంలో చెప్పడాన్ని ప్రశంసించారు. భారతదేశ సత్తా, పటిష్టత, భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేసిన రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుకొంటున్నానని ప్రధాని చెప్పారు.
 
గతంలో జరిగిన సంఘటనలు కూడా తనకు గుర్తున్నాయని, రాజ్యసభలో మాట్లాడాలనుకున్నప్పుడు తన ప్రసంగాన్ని అడ్డుకున్నారని, అయినప్పటికీ తాను ప్రసంగాన్ని కొనసాగించానని అన్నారు. ఇవాళ కూడా తన మాటలు వినేందుకు వారు సిద్ధంగా లేరనే విషయం తనకు తెలుసునని అన్నారు. అయితే తన గొంతును ఎవరూ అణిచివేయలేరని, ఈ గొంతుకు ప్రజలే బలం ఇచ్చారని, ఈసారి కూడా తాను సన్నద్ధంగానే వచ్చానని చెప్పారు.