
వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వానికి సంబంధించిన వాటితో పాటు సహ జీవనానికి రిజిస్ట్రేషన్ వంటి అంశాలను యూసీసీ బిల్లులో పొందుపరిచారు. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన యూసీసీ బిల్లు గవర్నర్ ఆమోదం పొందితే చట్టంగా మారనుంది.
దీంతో స్వాతంత్ర్యం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. పోర్చుగీస్ పాలనలో ఉన్నప్పటి నుంచి గోవాలో ఉమ్మడి పౌరస్మృతి అమల్లో ఉంది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూసీసీ బిల్లుకు సభ ఆమోదం కల్పించింది.
ఉత్తరాఖండ్‌కు ఇది చాలా ముఖ్యమైన రోజు అని ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదం సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న ఈ బిల్లును ఉత్తరాఖండ్ ఆమోదించిందని తెలిపారు. ఉమ్మడి పౌరస్మృతిని ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచిందని పేర్కొంటూ ఉత్తరాఖండ్ ప్రజలకు, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. తాము అధికారంలోకి రావడానికి, ఈ యూసీసీ బిల్లును ఆమోదించడానికి తమకు అవకాశం ఇచ్చారని ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా తమకు మద్దతు ఇచ్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధామీ ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ఎవరికీ వ్యతిరేకం కాదని.. ప్రతీ ఒక్కరికీ, ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తుందని స్పష్టం చేశారు. మతంతో సంబంధం లేకుండా వివాహం, వారసత్వం, విడాకులు వంటి విషయాల్లో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
సహజీవనం వల్ల పుట్టిన పిల్లలు చట్టబద్ధమైన వారసులుగా ఉంటారని, భాగస్వామి నుంచి విడిపోయిన మహిళకు భరణం పొందే హక్కు ఉంటుందని తెలిపారు. బహుభార్యత్వం నిషేధిస్తున్న బిల్ ఆయా మతాలవారిని తమ ఆచారాల ప్రకారం వివాహాలు చేసుకొనేందుకు అనుమతించింది. ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌర స్మృతి బిల్లు సహజీవనానికి ఆమోదం తెలుపుతూనే జంటల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నది.
సహజీవనం చేస్తున్న, చేయాలని భావిస్తున్న వ్యక్తులు ముందుగా తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, చట్టాన్ని అతిక్రమించే వారికి ఆరు నెలల జైలు, రూ.25వేల వరకు జరిమానా విధిస్తామని బిల్లులో స్పష్టం చేశారు. ఇక 21 ఏండ్లలోపున్న వ్యక్తులు సహజీవనం చేయాలనుకుంటే ఆ విషయాన్ని వారి తల్లిదండ్రులకు తెలిపే వెసులుబాటును రిజిస్ట్రార్‌కు కల్పించారు.
తమ పేర్లను నమోదు చేసుకోకుండా నెల రోజులకుపైగా సహజీవనంలో ఉంటే.. వారికి మూడు నెలల జైలు లేదా రూ.10వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనం విషయాన్ని దాచినా లేదా తప్పుడు సమాచారమిచ్చినా, వారికి కూడా మూడు నెలల జైలు, రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. సహజీవనంలో విడిపోవాలన్నా రిజిస్ట్రార్‌కు తెలపాలి.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!