టిడిపిని ఎన్డీయేలోకి తిరిగి ఆహ్వానించారా!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో బుధవారం రాత్రి భేటీ అయ్యారు. చంద్రబాబు అమిత్‌షా నివాసానికి రాత్రి 11.25 గంటల సమయంలో వెళ్లారు. అక్కడే ముగ్గురు నేతలు సమావేశమయ్యారు.  టీడీపీని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించేందుకు చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలస్తోంది.
ఇప్పటికే జనసేన, టీడీపీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించగా, బీజేపీ కూడా కూటమిలో చేరుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  బుధవారం రాత్రి 11.25 గంటలకు ఈ భేటీ మొదలై 12.16కు ముగిసింది.  బీజేపీ ఎన్డీయేతో గతంలో భాగస్వాములుగా ఉన్న పార్టీలను తిరిగి ఆహ్వానిస్తుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు వారితో భేటీ కావడం ప్రాధాన్యత ఏర్పడింది. 
దేశవ్యాప్తంగా ఎన్డీయేను బలోపేతం చేస్తున్నామని, దేశాన్ని బలోపేతం చేయాలంటే అన్ని ప్రాంతాల్లో తమ కూటమి అవసరమని అమిత్‌ షా పేర్కొన్నట్లు చెబుతున్నారు.  ఇతర రాష్ట్రాల్లో కూడా పలు పార్టీలు బీజేపీ వైపు చూస్తున్నాయని, ఈసారి 400 సీట్లకు పైగా విజయం సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం. ఇటీవల ఎన్డీయే కూటమిలోకి వచ్చిన బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ కూడా చంద్రబాబు కంటే కాస్త ముందు అమిత్‌షా, జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు. 
 
ప్రాథమికంగా చర్చలు కావొచ్చని, ఇందులో పొత్తులపై ఇరుపార్టీల పెద్దలు ప్రాథమిక అవగాహనకు రావొచ్చని చెబుతున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ టీడీపీ-బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేయగా.. పవన్ కళ్యాణ్ వీరికి మద్దతు తెలిపారు. దీంతో ఏపీలో ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈ క్రమంలోనే మరోసారి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఫలితాలు అనుకూలంగా వస్తాయని చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

 
అమిత్‌షాతో భేటీకి ముందు చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ బీజేపీకి దేశప్రయోజనాలు ముఖ్యమైతే, తెలుగుదేశానికి రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కు పోయిందని, రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. 
 
కొద్ది నెలల క్రితం అమిత్‌ షా తనతో మాట్లాడారని, ఇప్పుడు మళ్లీ కబురు పంపారని చంద్రబాబు తెలిపారు.  తెలుగుదేశం ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌ రావు, ఎన్నికల వ్యూహకర్త రాబిన్‌ శర్మ తదితరులు చంద్రబాబుతో చర్చలు జరిపారు. .వైసీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, రఘురామకృష్ణంరాజు కూడా చంద్రబాబుతో చర్చించారు.
 
కాగా, అమిత్‌ షాతో భేటీ పూర్తైన తర్వాత ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. చర్చలపై మాట్లాడేందుకు బిజేపి నాయకులు ఏమాత్రం ఇష్టపడలేదు. చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు టీడీపీ వర్గాలు సంకేతాలను ఇచ్చాయి. ఇరు పార్టీల ప్రయోజనాల రీత్యా కలిసి పని చేయడంపై టీడీపీ, బీజేపీ మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది.