కోడికత్తి కేసు నిందితుడికి హైకోర్టులో బెయిల్

కోడికత్తి కేసు నిందితుడికి హైకోర్టులో బెయిల్
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శ్రీనివాస్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ నిరాకరిస్తూ విశాఖ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. రూ. 25 వేలు పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. 
 
కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దని హైకోర్టు తెలిపింది. ప్రతి ఆదివారం ముమ్మిడి పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని ఆదేశించింది. దాదాపు ఐదేళ్ల తర్వాత కోడి కత్తి కేసు నిందితుడికి బెయిల్ లభించింది. కొద్ది రోజులుగా నిందితుడికి బెయిల్ మంజూరు చేయాలంటూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.

గత వారం విజయవాడలో నిందితుడు శ్రీనివాసరావు తల్లి, సోదరుడు ఆమరణ దీక్షకు దిగారు. మరోవైపు ఎన్‌ఐఏ కోర్టు పదేపదే బెయిల్ నిరాకరించడంతో బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌పై దాడి జరిగింది. ఈ కేసులో సాక్ష్యం ఇవ్వాల్సిందిగా పలుమార్లు సిఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినా రకరకాల కారణాలతో హాజరుకాలేదు.

మరోవైపు వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తి ఘటనలో కుట్రకోణం లేదని ఎన్ఐఏ గత ఏడాది కోర్టు విచారణలో స్పష్టం చేసింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందున ఇంకా దర్యాప్తు అవసరం లేదని ఎన్ఐఏ కోరింది. అయితే జగన్ పున్వరిచారణ జరపాలని కోర్టులో పిటిషన్ వేశారు. ఇదే సమయంలో ఈ కేసులోని ప్రధాన నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు చెప్పిన విషయాలను ఎన్ఐఏ రికార్డు చేసింది.

ఇందులో శ్రీనివాసరావు తాను మొదటి నుంచి వైఎస్సార్ అభిమానిని అని, జగన్ అధికారంలోకి రావాలని కోరుకున్నానని, ప్రజల్లో సానుభూతి కోసం జగన్‍పై దాడి చేశానని తెలిపాడు. ప్రమాదం జరగకుండా కోడి కత్తిని  2 సార్లు స్టెరిలైజ్ చేయించానని, జగన్‍కు టీ ఇచ్చేందుకు వెళ్లి ఈసారి ఎన్నికల్లో 160 సీట్లతో గెలుస్తారని కూడా ఆయనకు చెప్పినట్టు పేర్కొన్నాడు. తన మాటలకు ఆయన చిరునవ్వు చిందించారని, ఎయిర్‌ పోర్ట్‌లో దాడి జరిగిన వెంటనే వైసీపీ వారు తనపై దాడి చేస్తే పోలీసులు కాపాడి ఓ గదిలో బంధించినట్టు ఛార్జిషీట్‌లో పేర్కొన్నాడు.