ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి

ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
* బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ 

కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మస్థల ఆలయం వివాదంలో కీలకంగా ఉన్న చిన్నయ్య అనే వ్యక్తి హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ పేరు ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనను కర్ణాటక ప్రభుత్వం వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ జాతీయ మండలి సభ్యుడు  విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కుట్రలో ప్రకాష్ రాజ్ భాగస్వామ్యం కావటం సిగ్గుచేటని మండిపడ్డారు. 

ఈ అంశం మీద ప్రకాష్ రాజ్ వెంటనే స్పందించాలని, హిందువులకు క్షమాపణలు చెప్పి, కుట్ర వెనుక ఉన్నవారి పేర్లను బయటపెట్టాలని స్పష్టం చేశారు.  “కోట్లమంది హిందువుల ఆరాధ్య దైవం ధర్మస్థలం మీద జరిగిన కుట్రలో ప్రకాష్‍ రాజ్ నేరుగా భాగస్వామ్యం కావటం సిగ్గుచేటు. ప్రకాష్ రాజ్ ఎక్కడికి పారిపోయారు?” అంటూ ధ్వజమెత్తారు. 

“జస్ట్ ఆస్కింగ్ పేరుతో అందరినీ ప్రశ్నించే నువ్వు ఇంత పెద్ద కుట్రకోణంలో ఏ రకంగా ఇరుక్కున్నావ్? ఆ కుట్రకోణానికి బాధ్యులైన చిన్నయ్యతో మాట్లాడాల్సిన అవసరం మీకేంటి? కర్ణాటక పోలీసులు మీ కోసం ప్రయత్నిస్తుంటే ఎక్కడికి పారిపోయారు? ప్రజాస్వామ్యం మీద నీకు విశ్వాసం ఉంటే తక్షణం బయటకు రావాలి” అని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

“కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం, డీకే శివకుమార్ ప్రకాష్ రాజ్‌ను ఎందుకు అరెస్ట్ చేయటం లేదు? అన్ని విషయాలలో తలదూర్చే ప్రకాష్ రాజ్ హిందువుల మీద, హిందూసంస్థల మీద, దేవాలయాల మీద ఇంత కుట్ర చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరు?” అంటూ విస్మయం వ్యక్తం చేశారు.

మరోవైపు ధర్మస్థలలో వందల మృతదేహాలను అనుమానాస్పద రీతిలో ఖానానుమ్ చేసారంటూ సంచలన ఆరోపణలు చేసి అరెస్ట్ అయి, బెయిల్ పై ఉన్న చిన్నయ్య  అనే వ్యక్తి  తాజాగా ఈ కేసులో దర్యాప్తు వివరాలను బయటపెట్టాలని కోరుతూ చిన్నయ్య హైకోర్టులో అర్జీ దాఖలు చేశారు. ఈ అర్జీపై విచారణను జూన్ 29న హైకోర్టు విచారించనుంది. అయితే చిన్నయ్య కర్ణాటక హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఇటీవల ప్రకాష్ రాజ్ పేరు ప్రస్తావనకు వచ్చింది.  ప్రకాష్ రాజ్ తనతో ఫోన్‌లో మాట్లాడి, కొన్ని సూచనలు పాటించమని సలహా ఇచ్చారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.  
 
ఈ పరిణామాలపై స్పందిస్తూ ఈ అంశం అత్యంత సున్నితమైనదని, ధర్మస్థలతో ముడిపడి ఉన్న లక్షలాది మంది భక్తుల మనోభావాలను,  విశ్వాసాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని ప్రకాష్ రాజ్ అభివర్ణించారు. ప్రస్తుతం దూర ప్రాంతాల్లో ఉన్నానని, త్వరలోనే మీడియా ద్వారా అన్ని అంశాలపై వివరణ ఇస్తానని స్పష్టత ఇచ్చారు.