సీఎం చంద్రబాబు మామిడి రైతులను ఆదుకోవాలి

సీఎం చంద్రబాబు మామిడి రైతులను ఆదుకోవాలి

రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వారిని తక్షణమే ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడును ఓ లేఖలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పీవీఎన్ మాధవ్ కోరారు.  చిత్తూరు జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోందని, అందులో దాదాపు 70 శాతం వరకు తోతాపురి రకం మామిడి పంటనే రైతులు సాగు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. 

ఒక ఎకరా మామిడి సాగుకు రైతులు రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు పెట్టుబడులు పెట్టినప్పటికీ, ప్రస్తుతం మార్కెట్‌లో కిలోకు రూ.4 కూడా ధర లభించని పరిస్థితి నెలకొనడంతో రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి పండ్లకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల వేలాది రైతు కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయని, ఈ పరిస్థితి కొనసాగితే రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మామిడి పండ్ల కొనుగోలులో ప్రాసెసింగ్ పరిశ్రమలు, పల్ప్ ఫ్యాక్టరీలు రైతులకు న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని  మాధవ్ కోరారు. రైతులకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకటించే అంశాన్ని పరిశీలించడంతో పాటు, మామిడి పల్ప్ పరిశ్రమల ద్వారా రైతులకు గిట్టుబాటు ధర అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు తీసుకుని మామిడి రైతులను ఆదుకోవాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రిని కోరారు. మామిడి రైతుల కష్టాలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి వెంటనే ఉపశమన చర్యలు ప్రకటించాలని ఆయన ఆకాంక్షించారు.