దేశ సమగ్రతను బలి చేసేందుకు కొన్ని దేశద్రోహ శక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయని జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హెచ్చరించారు. అలాంటి శక్తులకు వ్యతిరేకంగా జనసేన నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం అనేది ఒక్క రోజుతో అయ్యే పని కాదని, ప్రతి తరం దీనిని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.
ఢిల్లీలో జనసేన ప్రజాప్రతినిధులతో జరిగిన ‘జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం’ ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ జాతీయవాదాన్ని, దేశభక్తిని నిజంగా అర్థం చేసుకోవాలంటే ఢిల్లీ కేంద్రంగానే మాట్లాడాలని ఆయన స్పష్టం చేశారు. దేశ సమగ్రత, సమైక్యతకు ఏ ఆటంకం వచ్చినా జనసేన పార్టీ ముందుండి పోరాడుతుందని తెలిపారు. దేశమే ముందు.. మిగతావన్నీ తర్వాతే అనేది మా పార్టీ విధానం అని చెబుతూ విభజన వాదాలు, ప్రాంతీయ విద్వేషాలు, ప్రజల్లో విబేధాలు సృష్టించే శక్తులపై జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పోరాడుతారని తెలిపారు.
2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు జనసేన పార్టీ ఏనాడూ అడ్డు చెప్పలేదని, కానీ, ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిన అనాలోచిత విధానం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, అశాంతి నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన జరిగి ఇన్నేళ్లయినా ఆస్తుల పంపిణీ లాంటి వారసత్వ సమస్యలు ఇవాళ్టికీ అలానే ఉండిపోయాయని విచారం వ్యక్తం చేశారు. ఆనాడు రాష్ట్రాన్ని ముక్కలు చేసిన నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ ధోరణి ఏమాత్రం మారలేదని మండిపడ్డారు.
దీనికి ఉదాహరణగా ఇటీవల తెలంగాణలో జనసేన సభ సంపూర్ణంగా నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకున్న పరిస్థితిని ఆయన ప్రస్తావించారు. ‘‘భారత్ జోడో’ యాత్ర పేరుతో కాంగ్రెస్ నాయకులు దేశమంతటా తిరిగి అందరినీ కలుస్తారు. కానీ, నేను తెలంగాణలో తిరుగుతానంటే మాత్రం అనుమతి ఇవ్వరు” అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో యువతను బలిచేసి నాయకులు గద్దెనెక్కారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరులైతే వాళ్లను గుర్తించడానికి 12 సంవత్సరాలు కూడా ఇంకా సరిపోవడం లేదా? అని ప్రశ్నించారు.
ఈ రోజు అందరూ ‘జెన్-జీ’ గురించి మాట్లాడుతున్నారని, అయితే, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన 1200 మంది యువతకు ఏం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. జెన్-జీ కంటే ముందుతరం తెలంగాణ ఉద్యమ యువత ఉద్వేగంతో వేర్పాటువాద భావజాలాలవైపు వెళ్లి ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ బలిదానాలు తనను కదిలించాయన్నారు. 1200 మందికి నివాళులర్పిద్దామని తాను వెళితే తెలంగాణ ప్రభుత్వం అనుమతివ్వలేదని విమర్శించారు.

More Stories
సీఎం చంద్రబాబు మామిడి రైతులను ఆదుకోవాలి
ధర్మస్థల వివాదంలో ప్రకాష్ రాజ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
కేంద్రం సాయాన్ని, ప్రధాని మోదీ చేయూతను మరువలేం