కశ్మీర్‌లో ఉగ్రదాడిలో ఇద్దరు వలస కూలీలు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గుర్తు తెలియని ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. ఒకరు అక్కడే మృతి చెందగా, మరొకరు గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు.  ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. 

విషయం తెలుసుకున్న పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు. ముష్కరులను పట్టుకునేందుకు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శ్రీ నగర్‌లోని హబ్బా కడల్ ప్రాంతంలోని షాహీద్ గంజ్ వద్ద బుధవారం రాత్రి 7 గంటలకు ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. 

అక్కడే చనిపోయిన వ్యక్తిని పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చెందిన అమృత్ పాల్ సింగ్‌ (25)గా గుర్తించారు. కాల్పులలో గాయపడిన రోహిత్ మాషి శ్రీనగర్ లోని ఎస్ఎంహెచ్ఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.  అమృత్‌పాల్‌ పంజాబ్‌లోని అమృత్‌సర్‌ నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారని చెప్పారు. ఇక గాయపడిన మరో వ్యక్తిని రోహిత్‌ అని వెల్లడించారు. ఏకే 47తో ముష్క‌రులు పంజాబ్ కార్మికులపై కాల్పుల‌కు తెగ‌బ‌డినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ఇక వలస కార్మికుల మీద జరుగుతున్న వరుస దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే ఈ ఏడాదిలో స్థానికేతరులపై జరిగిన తొలి దాడిగా పోలీసులు వెల్లడించారు. గ‌తేడాది కాశ్మీర్ లోయ‌లోని అనంత్ నాగ్, షోపియాన్ ప్రాంతాల్లో వలస కార్మికుల‌పై దాడులు జ‌రిగాయి.

జార్ఖండ్‌లో ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్ల మృతి

మరోవంక, జార్ఖండ్‌లో నక్సల్స్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్‌లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది బుధవారం ఒక ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా, చత్ర జిల్లాలోని బైరియో అడవుల్లో వారిపై తృత్య సమ్మేళన్‌ ప్రస్తుతి కమిటీ (టీపీఎస్‌సీ)కి చెందిన నక్సల్స్‌ ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు ఐజీ అమోల్‌ వీ హొమాకర్‌ నిర్ధారించారు. గాయపడిన జవాన్‌ను వాయుమార్గంలో రాజధాని రాంచీకి తరలించినట్టు చెప్పారు.