బీజేపీయేత‌ర రాష్ట్రాల ప‌ట్ల వివ‌క్ష అవాస్త‌వం

బీజేపీయేత‌ర రాష్ట్రాలకు రావాల్సిన‌ జీఎస్టీ బ‌కాయిలు, ప‌న్ను వాటాల‌ను చెల్లించ‌డంలో కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌధ‌రి చేసిన ఆరోప‌ణ‌ల‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తోసిపుచ్చారు. లోక్‌స‌భ‌లో సోమ‌వారం ఆమె మాట్లాడుతూ అధిర్ రంజ‌న్ ఆరోప‌ణులు రాజకీయ కోణంలో ఉన్నాయ‌ని ఆమె త‌ప్పుప‌ట్టారు.

రాష్ట్రానికో ర‌కంగా త‌న ఇష్టానుసారంగా నిబంధ‌న‌ల‌ను మార్చే హ‌క్కు త‌న‌కు లేద‌ని, ఇది త‌మ పార్టీ రాజ‌కీయాల‌కూ విరుద్ధ‌మ‌ని నిర్మ‌లా సీతారామ‌న్ స్ప‌ష్టం చేశారు. త‌న‌కు నిబంధ‌న‌ల‌ను మార్చే బాధ్య‌త ఉండ‌ద‌ని, తాను నిబంధ‌న‌ల‌ను నూరు శాతం అనుస‌రించాల్సిందేన‌ని పేర్కొన్నారు. ప‌న్నుల వాటా రాష్ట్రాల మ‌ధ్య పంపిణీని ఫైనాన్స్ క‌మిష‌న్ నిర్ధేశిస్తుంద‌ని ఆమె వివ‌రించారు.

”పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగానే ఉంటాయి. రాష్ట్రానికి ఒక రకంగా నిబంధనలు మార్చే హక్కు నాకు లేదు. కొన్ని రాష్ట్రాలు రాజ‌కీయ రంగు పులుముతూ ఆయా రాష్ట్రాల ప‌ట్ల వివ‌క్ష క‌న‌బ‌రుస్తున్నామ‌ని ఆరోపించడం సరికాదు” అని నిర్మలా సీతారామన్ వివరణ ఇచ్చారు.

ఫైనాన్స్ క‌మిష‌న్ సిఫార్సుల‌ను తాను అమ‌లు చేయాల్సి ఉంటుంద‌ని చెబుతూ  దీన్ని తాము ఎలాంటి భ‌యం, ప‌క్ష‌పాతం లేకుండా చేప‌డ‌తామ‌ని ఆమె తెలిపారు. ఈ ప్ర‌క్రియ ఇలా సాగుతుంటే కొన్ని రాష్ట్రాలు రాజ‌కీయ రంగు పులుముతూ ఆయా రాష్ట్రాల ప‌ట్ల వివ‌క్ష క‌న‌బ‌రుస్తున్నామ‌ని ఆరోపిస్తున్నాయ‌ని అంటూ ఆమె  అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

చర్చ సందర్భంగా అధీర్ రంజన్ జోక్యం చేసుకుంటూ, రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందడానికి కర్ణాటక తాజా ఉదాహరణ అని అన్నారు. దీనిపై కర్ణాటక మంత్రివర్గమంతా ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కొద్ది నెలల క్రితం వరకూ అంతా సవ్యంగానే ఉందని, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమస్య మొదలైందని ఆయన ఆరోపించారు. 

దీనిపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఎస్‌జీఎస్‌టీ 100 శాతం రాష్ట్రాలకు వెళుతుందని, ఇది ఆటోమేటిక్ ప్రొవిజన్ అని చెప్పారు. ఐజీఎస్‌టీ అనేది అంతర్‌రాష్ట్ర పేమెంట్లనీ, పీరియాడికల్‌గా సమీక్ష ఉంటుందని చెప్పారు. సీజీఎస్‌టీ అనేది ఫైనాన్స్ కమిషన్ నిర్ణయిస్తుందని ఆమె స్పష్టం చేశారు. త‌న‌కు ఈ రాష్ట్రం ఇష్టం లేద‌ని వారికి చెల్లింపులు నిలిపివేయ‌డంని ఏ ఆర్ధిక మంత్రి జోక్యం చేసుకోవ‌డం సాధ్యం కాద‌ని ఆమె తేల్చి చెప్పారు. 

ప్రతి ఆర్థిక మంత్రి చేసినట్టుగానే 100 శాతం ఆర్థిక కమిషన్ సిఫారసులను తాను పాటిస్తానని, దీన్ని ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా తాము చేపడతామని చెప్పారు. “ఫైనాన్స్ కమిషన్ చెప్పకుండా నేను చేయడానికి ఏమీ లేదు. దయచేసి నేను ఏదో వివక్ష చూపుతున్నానని ఊహించుకోవద్దు. ఫైనాన్స్ కమిషన్‌తో మాట్లాడండి” అంటూ నిర్మలా సీతారామన్ తన చర్చను ముగించారు.

సభలో మరోసారి దీనిపై అధీర్‌రంజన్‌ మాట్లాడబోతే.. నిర్మలాసీతారమన్‌ మరింత ఆవేశానికి గురై..’అధీర్‌జీ ఏమైనా సందేహాలుంటే.. దయచేసి ఫైనాన్స్‌ కమిషన్‌తో మాట్లాడండి’ అని చెప్పారు.