
హిందు మతాని నమ్మి, ఈ ధర్మాని ఆచరించాలన్న ఇతర మతస్థులకు తిరుమల క్షేత్రంలో ఒక వేదిక ఏర్పాటు చేస్తామని ఈ సదస్సు తీర్మానాలను వెల్లడిస్తూ టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఇతర మతస్థులు హిందూ మతంలోకి మారేందుకు స్వచ్చందంగా ముందుకు వస్తే, తిరుమలలో మతమార్పిడి చేయించి వారికి శ్రీవారి దర్శనభాగ్యం కల్పిస్తామని తెలిపారు.
హిందూ ధర్మరక్షణకై ఈ సదస్సు ఎంతగానో దోహదపడుచున్నదని ఇటువంటి సదస్సులు ప్రతి సంవత్సరానికి ఒకసారి తిరుమలలో లేదా తిరుపతిలోనైనా జరగాలి. అలాగే గ్రామస్థాయిలోను, జిల్లా స్థాయిలోను కూడా నిర్దిష్టకాలపరిమితిలో తరచూ నిర్వహించాలని సదస్సు నిర్ణయించింది.
ఈ సదస్సులో తీసుకున్న తీర్మానాలన్నిటినీ కేవలం తిరుమల తిరుపతి దేవస్థానములు ఆచరించుటయే కాక హిందూ ధర్మపరిరక్షణకు పాటు పడే అన్ని ధార్మికసంస్థలు కూడా అమలుపరచాలని సదస్సు పిలుపిచ్చింది. సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు హైందవధర్మాన్ని సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేవి పురాణాలు. కనుక పురాణముల విస్తృత ప్రచారం చేయుటకు అదేవిధంగా సామర్థ్యం కలిగిన పురాణ ప్రవచనకర్తలకు శిక్షణనిచ్చుట అవసరం అని సదస్సు తీర్మానించింది.
తిరుమల చేరుకోవాలంటే యాత్రికులందరూ తప్పనిసరిగా తిరుపతికి రావలసిందే. కనుక యాత్రికులకు తిరుమలలో లాగే తిరుపతిలో కూడా సంపూర్ణమైన ఆధ్యాత్మిక వాతావరణం, భక్తిభావన కలగాలి. అందుకు తగినట్లుగా తిరుపతిని మార్చాలని సదస్సు నిర్ణయ్హించింది.
నానాటికీ హిందూ సమాజం బలహీనం కావడానికి కారణం కొన్ని వర్ణ, వర్గాల పట్ల కొందరికి ఉన్న వివక్షతో కూడిన దృష్టి ప్రధానాంశం. అందువలన ఆయా జాతులవారు హిందూసమాజానికి దూరం అవుతున్నారు. వారినందరినీ కలుపుకుని సనాతన ధర్మం అందరిదీ అని చెప్పడానికి అన్ని విధాలుగానూ ప్రయత్నించాలి. వారి మతాంతీకరణను నివారించుటకు తగిన ఉపాయాలను సిద్ధపరచుకోవాలని సదస్సు తీర్మానించింది.
భారతీయ సమాజంలో అందరికీ చక్కని సంస్కారాలను నేర్పేవి దేవాలయాలు. అటువంటి దేవాలయాలు వేలాదిగా శిథిలమవుతున్నాయి, కొన్ని ప్రాంతాలలో పూర్తిగా కనుమరుగవుతున్నాయి. కనుక అందరికీ సంస్కారాలందించడానికి శిథిలములైన దేవాలయాలను ఉద్ధరించుట, దేవాలయాలు లేని చోట, హరిజన, గిరిజన, మత్స్యకార ప్రాంతాలలో దేవాలయాలు నిర్మించుట ఎంతగానో అవసరమని సదస్సు తీర్మానించింది. టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా హరిజన, గిరిజన, మత్స్యకార ప్రాంతాలలో 3600 ఆలయాల నిర్మాణం చేపట్టింది.
హిందూ సమాజం గోవిందుని పట్ల ఎంత భక్తి కలిగి ఉన్నదో గోవు పట్ల కూడా అంతే భక్తి కలిగి ఉన్నది. హిందువులకు గోవు తల్లితో సమానం. కానీ నేటి సమాజంలో ఆధునిక అలవాట్ల ప్రభావం వల్ల గోమాతలు క్షీణించిపోతున్నాయి. కనుక గో సంరక్షణ అత్యావశ్యకతగా సదస్సు తీర్మానించింది.హిందూ ధర్మానికి మూలం వేదములు, శాస్త్రములు. ఏ యజ్ఞములు చేయాలన్నా, ఏ సత్కర్మలు ఆచరించాలన్నా వేదశాస్త్రాలు ఎంతో అవసరం. కనుక వేదశాస్త్రాల పరిరక్షణ ఎంతో అవసరమని సదస్సు గుర్తు చేసింది.
ఏ సమాజంలో తల్లి తన పిల్లలను శ్రద్ధగా పెంచుతుందో ఆ సమాజం ధర్మనిలయం అవుతుంది. కనుక హిందూ సమాజంలో ప్రతి మాతృమూర్తి తన పిల్లలకు బాల్యం నుంచి ధర్మబోధను చేయడానికి తగు విధంగా మాతృమూర్తులకు ధర్మనిష్ఠను కలుగచేసే శిక్షణా కార్యకలాపాలు అవసరమని సదస్సు తీర్మానించింది.
నేటి సమాజంలో హిందూ యువతీ యువకులలో చాలామంది తమ చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం వల్ల, ధనకనకాది ప్రలోభాలవల్ల స్వధర్మాన్ని విడిచిపెట్టి మతాంతరీకరణకు లోనవుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికై ఎన్నో శిక్షణా శిబిరాలు నిర్వహించడం, ఇతర పథకాలు అవసరమని సదస్సు తీర్మానించింది.
More Stories
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?.. చర్చలంటూ గగ్గోలు!
అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రోడ్ షో రద్దు
దౌర్జన్యాలు చేసే వారికి గుణపాఠం నేర్పడమే హిందూ మతం