* కాంగ్రెస్ దుకాణంకు త్వరలో తాళం
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ వేదికగా సార్వత్రిక ఎన్నికల సమరానికి సన్నద్ధతను వ్యక్తం చేస్తూ తాము వంద రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 370కి పైగా స్ధానాలు ఖాయమని, ఎన్డీయే 400 సీట్లకు పైగా గెలుచుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. తాము తిరిగి అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ సోమవారం మాట్లాడుతూ తాము హ్యాట్రిక్ కొడతామని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగానే అబ్ కీ బార్ మోదీకీ సర్కార్ అంటూ నినాదాన్నిచ్చారు. గత పదేళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు, నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.
మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు. 2014 లో తాము అధికారంలోకి వచ్చినపుడు ప్రపంచంలో 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం 5 వ స్థానానికి తీసుకు వచ్చినట్లు గుర్తు చేశారు.
ఇక భారతీయుల శక్తి సామర్థ్యాలపై కాంగ్రెస్‌కు ఎప్పుడూ నమ్మకం లేదని ప్రధాని మండిపడ్డారు. ప్రధానిగా తొలి ప్రసంగం చేసిన జవహర్ లాల్ నెహ్రూ విదేశీయులతో పోలిస్తూ భారతీయులకు నైపుణ్యం లేదని చెప్పినట్లు మోదీ గుర్తు చేశారు. అప్పుడే భారతీయుల శక్తిపై నెహ్రూ విశ్వాసం వ్యక్తం చేయలేదని మండిపడ్డారు.
నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారని పేర్కొంటూ భారతీయులకు ఆత్మన్యూనత ఎక్కువని ఆమె చిన్నచూపు చూశారని ఆరోపించారు. వాళ్లిద్దరికీ భారతీయుల శక్తిపై నమ్మకం ఉండేది కాదని దుయ్యబట్టారు. ఇక దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు న్యాయం చేయలేదని ప్రధాని మోదీ ఆరోపించారు.
దేశంలో అవినీతిపరులపై దర్యాప్తులు సంస్థలు దాడులు చేస్తుంటే విపక్ష నేతలు వారికి మద్దతు పలుకుతూ ప్రభుత్వం విమర్శుల చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. గతంలో పార్లమెంటులో అవినీతి గురించే మాట్లాడేవాళ్లం.. వారిపై చర్యలకు డిమాండ్ చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు అలాంటివేం లేవు. అయితే, ఇప్పుడు అవినీతిపరులపై దాడులు జరుగుతుంటే వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారని విపక్ష నేతలపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓబీసీ నాయకులను వారు అవమానించారని మండిపడ్డారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు తాము భారతరత్న అవార్డు ఇచ్చి సత్కరించామని, కానీ ఆయన సీఎంగా ఉన్నపుడు కుట్రలు చేసి కర్పూరీ ఠాకూర్‌ను గద్దె దించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఖాదీని మరిచిపోయారని, కానీ తాము మాత్రం ఖాదీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
ఆర్టికల్ 370 ని రద్దు చేశామని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేశామని తెలిపారు. వలసవాదుల కాలం నాటి చట్టాలను తొలగించి వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహితను తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రాముడు తన సొంత ఇంటికి తిరిగి వచ్చాడని, ఇది దేశానికి సరికొత్త శక్తిని ఇచ్చినట్లు ప్రధాని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తీరు తోనే విపక్షాలకు ఇంతటి దుస్ధితి ఎదురైందని ఎద్దేవా చేశారు. అందుకే ఆ కూటమి కూలిపోతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలను పాలిస్తూ చిన్నచూపు చూసేదని విమర్శించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నత్తనడకతో ఎవరూ పోటీపడలేరని తెలిపారు.
ఇక తమ హయాంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇచ్చామని, చంద్రయాన్ 3 విజయవంతమైందని వివరించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు సాయం చేస్తున్నామని అన్నారు. రైతులపై కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోందని దుయ్యబట్టారు. ఇక మేకిన్ ఇండియాతో తక్కువ ధరకే మొబైల్స్, డేటా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
ఆరు నెలల్లో ఏపీకి కేంద్రం రూ 3 లక్షల కోట్ల సాయం
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం