విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన చంపాయ్ సోరెన్ ప్ర‌భుత్వం

జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వ‌హించిన‌ విశ్వాస ప‌రీక్ష‌లో  చంపాయ్ సోరెన్ ప్ర‌భుత్వం నెగ్గింది. విశ్వాస ప‌రీక్ష‌కు అనుకూలంగా 47 ఓట్లు, వ్య‌తిరేకంగా 29 ఓట్లు పోల‌య్యాయి. ఈ మేర‌కు చంపై సోరెన్ విశ్వాస ప‌రీక్ష‌లో నెగ్గిన‌ట్లు జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్ సీపీ రాధాకృష్ణ‌న్ ప్ర‌క‌టించారు. అనంత‌రం చంపై సోరెన్‌కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ హ‌ర్ష‌ధ్వానాలు మోగించారు. 
 
విశ్వాస ప‌రీక్ష ముగిసిన అనంత‌రం అసెంబ్లీ వాయిదా ప‌డింది. మ‌ళ్లీ మంగ‌ళ‌వారం స‌భ ప్రారంభం కానుంది. విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో చంపాయ్ సోరెన్ మాట్లాడుతూ  కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ఆరోపించారు. 2019లో జార్ఖండ్‌ ప్రజలు హేమంత్‌ సోరెన్‌ను సీఎంగా ఎన్నుకున్నారని, అలాంటి సీఎంను ఇప్పుడు బీజేపీ అరెస్ట్‌ చేయించిందని ఆయన విమర్శించారు.

జార్ఖండ్‌ రాష్ట్ర చరిత్రలో గిరిజనులు ఎప్పుడు తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నించినా వారి నాయకత్వాన్ని అణగదొక్కే ప్రయత్నం జరిగిందని చంపాయ్‌ సోరెన్‌ ఆరోపించారు. హేమంత్‌ సోరెన్‌ విషయంలో ఎంత అన్యాయం జరుగుతున్నదో ఇప్పుడు దేశమంతా చూస్తున్నదని చెబుతూ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా హేమంత్‌ సోరెన్‌ సంక్షేమ పథకాలు కనిపిస్తాయని స్పష్టం చేశారు.

మాజీ సీఎం, జేఎంఎం పార్టీ నాయకుడు హేమంత్‌ సోరెన్‌ ప్రసంగిస్తూ  గత జనవరి 31న రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు తనను అరెస్ట్‌ చేశారని, అది ఒకటి చీకటి అధ్యాయమని అభివర్ణించారు. ఒక సీఎం అరెస్ట్‌ కావడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటూ తన అరెస్ట్‌ వెనుక రాజ్‌భవన్‌ ప్రమేయం ఉన్నదని గట్టిగా నమ్ముతున్నానని ఆరోపించారు. తాను నేరం చేసినట్లు రుజువైతే రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఈ సందర్భంగా ప్రకటించారు.

‘జనవరి 31న నన్ను అరెస్ట్‌ చేశారు. అది నా జీవితంలో ఒక చీకటి అధ్యాయం. ముఖ్యమంత్రిని అరెస్ట్‌ చేయడం దేశంలో ఇదే తొలిసారి. ఈ అరెస్ట్‌ వెనుక రాజ్‌భవన్‌ ప్రమేయం ఉందని నేను గట్టి నమ్ముతున్నా. నేను భూ కుంభకోణానికి పాల్పడినట్లు రుజువైతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అని ప్రకటించారు. 

మనీ లాండరింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్‌ సోరెన్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్‌ ఆదేశాల మేరకు సోమవారం ఆయన అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొంటున్నారు. రాంచి కోర్టు అనుమతితో మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ కూడా బలపరీక్షలో ఓటు వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు.

కాగా, సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రారంభం కాగానే గవర్నర్‌ ప్రసంగించారు. గవర్నర్‌ ప్రసంగిస్తున్న సమయంలో అధికార పక్షం ఎమ్మెల్యేలు హేమంత్‌ సోరెన్‌ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ నుంచి బయటికి వచ్చిన తర్వాత గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ అధికార పక్ష ఎమ్మెల్యేల తీరును తప్పుపట్టారు. తన ప్రసంగ ప్రతిని రూపొంచింది ప్రభుత్వమేనని, ఆ ప్రతిని చదువుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలే నినాదాలు చేయడం సబబు కాదని ఆయన హితవు చెప్పారు.