తెలంగాణాలో రెండంకెల ఎంపీ సీట్లకై బిజెపి వ్యూహం

*  అయోధ్యకు ప్రత్యేక రైళ్లు, 5 నుంచి 8 వరకు `గావ్‌ చలో-బస్తీ చలో’
 
అసెంబ్లీ ఎన్నికల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 8 సీట్లను గెల్చుకోవడంతో పాటు 14 శాతం ఓట్లు కూడా తెచ్చుకోవడంతో  ఇప్పుడు రానున్న లోక్ సభ ఎన్నికలపై బిజెపి దృష్టి సారించింది. 2018లో కేవలం 1 అసెంబ్లీ సీటు మాత్రమే గెలుపొందిన అనూహ్యంగా 4 లోక్ సభ సీట్లను గెలుచుకుని అందరిని ఆశ్చర్య పరిచారు.
 
ఇప్పుడు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రధాని మోదీ పట్ల  ప్రజాదరణ వ్యక్తం అవుతూ ఉండటం, మరోవంక అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంతో వరుసగా మూడోసారి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడుతుందనే భరోసా వ్యక్తం కావడంతో తెలంగాణాలో సహితం కనీసం రెండంకెల సీట్లు గెలుచుకోవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు. మొత్తం 17 సీట్లు ఉండగా, 10 నుండి 12 సీట్లు గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
 
మొదటగా రామమందిర సెంటిమెంట్‌ను ప్రధాన ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని చూస్తున్నారు. తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తుల హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడిపే ఈ నెల 5 నుంచి మార్చి 5 వరకు నడుపుతున్నారు. తెలంగాణ నుంచి అయోధ్యకు 17 ప్రత్యేక రైళ్లను నడపాలని  నిర్ణయించారు. 
 
తెలంగాణలోని ప్రతీ పార్లమెంట్‌ నియోజక వర్గం నుంచి ఒక్కో ప్రత్యేక రైలును అయోధ్యకు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.  ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి 1000 నుంచి 2000మంది అయోధ్యకు వెళ్లే అవకాశాన్ని కల్పించేలా సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యకు బీజేపీ నడిపే ప్రత్యేక రైళ్ల ఏర్పాట్లు, నిర్వహణ తదితర అంశాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఇప్పటికే రెండు ప్రత్యేక కమిటీలను వేశారు. 
 
ఒక కమిటీ తెలంగాణలో రైళ్ల నిర్వహణ ఏర్పాట్లను సమన్వయం చేస్తే, మరో కమిటీ ఇక్కడి నుండి వెళ్లిన వారికి అయోధ్యలో అన్ని ఏర్పాట్లను సమకూర్చనుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మొదటి రామభక్తులు రైలు ద్వారా అయోధ్యకు చేరుకోనున్నారు. ఈ రైలును  సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వారికి జెండా ఊపి ప్రారంభిస్తారు.
 
మరోవంక, ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశాలు రాష్ట్రంలో 17 నియోజకవర్గాల్లో ఆదివారం నుండి జరుపుతున్నారు. కాగా, ఈ నెల 5 నుంచి 8 వరకు బిజెపి గావ్‌ చలో-బస్తీ చలో కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలొ 12,769 గ్రామ పంచాయతీలు, శివారు గ్రామాలు, 5,564 గ్రామాలకు కలిపి రాష్ట్రంలోని మొత్తం 35వేల పొలింగ్ బూత్ లన్నింటికీ కూడా పార్టీ శ్రేణులు తరలివెళ్ళనున్నారు.

రాష్ట్ర పార్టీ అధ్యక్షుల నుండి  అగ్రశేణి నాయకత్వంతో పాటు, సమర్థత ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా గ్రామాలకు తరలివెళ్ళుతున్నారు.
కార్పోరేషన్ లో అయితే డివిజన్ ఒదిలి ఇంకో డివిజన్, గ్రామాల్లో అయితే గ్రామం ఒదిలి మరో గ్రామానికి ప్రవాసీ కార్యకర్తలు వెళ్తారు. 24 గంటల పాటు గ్రామంలో ఉండి, కార్యకర్తలతో ముచ్చటించి, బూత్ ను సమీక్షించి బలోపేతం చేస్తారు.

కొన్నిచోట్ల ఉన్న ఖాళీలను బర్తీ చేసి, మిగిలిపోయిన బూత్ కమీటీలను ఏర్పాటు చేస్తారు. అన్ని సామాజికవర్గాల పెద్దలను, సమాజాన్ని ప్రభావితం చేసే నాయకులను కలుస్తరు. ఆధ్మాత్మిక కేంద్రాల్లో దర్శనం చేసుకుంటారు. అంతేకాకుండా నరేంద్రమోదీ  ప్రభుత్వంలో తెలంగాణకు జరిగిన అభివృధ్ది, కేంద్ర ప్రభుత్వ లభ్దిదారులను కలిసి, ఆ గ్రామానికి కేంద్రం ద్వారా జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామ పంచాయతీలలో, నగరాల్లో, పట్టణాల్లో  ప్రజలకు వివరిస్తారు.