తెలంగాణ గీతంగా ‘జయ జయహే తెలంగాణ’

రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాత్కాలిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని, ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.  జయ జయహే తెలంగాణ గీతాన్ని రచయిత అందెశ్రీ రచించారు.

“జయజయహే తెలంగాణ.. జయజయహే తెలంగాణ జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

పోతనదీ పురిటిగడ్డ రుద్రమదీ వీరగడ్డ గండరగండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతి రేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగె చార్మినార్‌ జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

జానపద జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి తరుగనిదీ నీత్యాగం మరువనదీ శ్రమ యాగం జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

సిరివెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువుకు సింగారం సహజమైన వనసంపద సక్కనైన పువ్వుల పొద సిరులు పండె సారమున్న మాగాణియె కద నీ ఎద జై తెలంగాణ! జైజై తెలంగాణ!!

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగ పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగ ఉండాలి ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి జై తెలంగాణ! జైజై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!!”

వాహనాల రిజిస్ట్రేషన్‌లో `టీఎస్‌’ను `టీజీ’గా మార్చాలని, అలాగే తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలోనూ మార్పులు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. రూ 500ల‌కే గ్యాస్ సిలిండ‌ర్, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప‌థ‌కాల‌పై కూడా మంత్రివర్గం చర్చించి ఈ నెల‌లో ఈ రెండు ప‌థ‌కాల అమ‌లున‌కు కార్య‌చ‌ర‌ణ‌కు ఆమోద ముద్ర వేసింది.

ఈ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ తల్లి విగ్రహం ఒక వ్యక్తిని గుర్తుకు తెచ్చేలా ఉన్నదని, రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలు ఉన్నాయని అందుకే వాటిని మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు చెప్పారు.  కవులు, కళాకారులు, మేధావుల అభిప్రాయాలను తీసుకొని తుది రూపు ఇస్తామని చెప్పారు.

తెలంగాణ కోసం పోరాడిన వారు, అనేకసార్లు జైలుకు వెళ్లిన వారికి తెలంగాణ చిహ్నంలో స్థానం కల్పిస్తామని తెలిపారు. ఆర్టీసీలో ఇప్పటివరకు 14.25 కోట్ల మంది మహిళలు జీరో టికెట్‌పై ప్రయాణించారని వెల్లడించారు. కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. తెలంగాణ హైకోర్టు నూతన భవనాలకు 100 ఎకరాలు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

రాష్ట్రంలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ డేట్ చేయాలని నిర్ణయించింది. కాగా, సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో కుల గణనకు, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. గ్రూప్‌ -1లో 160 పోస్టులు కలిపి మళ్లీ నోటిఫికేషన్‌కు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారని చెబుతూరాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే ప్రక్రియ మొదలైందని మంత్రులు చెప్పారు.