ప్రకృతిని భగవంతుడుగా భావించే గిరిజనులది విశిష్ట సంస్కృతి

ప్రపంచం అంతా ఆమోదిస్తున్న గౌరవంగా చూస్తున్న భారతీయ సంస్కృతి ఇక్కడి ఆదివాసీ సంస్కృతి నుంచే వచ్చిందని వనవాసీ కళ్యణ్ ఆశ్రమ్ జాతీయ కార్యదర్శి పి సోమయాజులు తెలిపారు. రాష్ట్ర  వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ విజయనగరం కేంద్రీయ విశ్వవిద్యాలయంతో కలసి విలేఖలో నిర్వహించిన తూర్పు కనుమల గిరిజన సాంస్కృతిక యాత్ర ముగింపు సభకు  ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

మన సంస్కృతి, సభ్యత, సంప్రదాయాలు అరణ్యం నుంచే వచ్చాయని, సమాజానికి మార్గదర్శకులైన రుషులు, మునులు అక్కడే వుండేవారని తెలిపారు. చెట్ల మాదిరి జీవనం సాగించడం ద్వారా గిరిజనులు సాటి సమాజానికి ఆదర్శంగా నిలచారని, చెట్లు ఎండను తాము  భరించి కింద వుండే వారికి నీడనిస్తాయని చెప్పారు.

ప్రకృతిని భగవంతుడి స్వరూపంగా భావించే గిరిజనులను ఆదర్శంగా తీసుకోవాలని, వారు అడవిలో చెట్టును నరకాల్సి వచ్చినప్పుడు దానికి నమస్కారం చేస్తారని వివరించారు. భారత్ కు బ్రిటీష్ వారు రాకముందు అడవులు ఆరోగ్యంగా వుండి దేశాన్ని రక్షించాయని, అటవీ ఫలసాయాన్ని బ్రిటీష్ వారు వ్యాపారంగా మార్చి అడవుల విస్తీర్ణాన్ని తగ్గించారని సోమయాజులు చెప్పారు.

గిరిజన హక్కుల పరిరక్షణ సంస్థ హిత రక్షా జాతీయ కార్యదర్శి గిరీష్ కుబేర్ మాట్లాడుతూ, గిరిజనులను అభివృద్ధి చేయాలంటే ముందుగా గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, బాషలను అర్ధం చేసుకోవాలని సూచించారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు ఆ పనిచేసి సూచనలివ్వాలని, అప్పడు అటవీ హక్కుల చట్టం, కమ్యూనిటీ హక్కులు, పీసా చట్టం పరిపూర్ణంగా అమలు అవుతాయని అభిప్రాయపడ్డారు.

గిరిజనులకు నమ్మకం కలిగించి వారిని కలుపుకోగలిగే విధానాన్ని రూపొందించాల్సిన అవసరం వుందని చెప్పారు. గిరిజనులను గుర్తించడం, అర్ధం చేసుకోవడం చేసిన తరువాతే వారి అభివృద్ధి పధకాలు బాగా అమలు అవుతాయని ఆయన స్పష్టం చేశారు.  
 
విజయనగరం గిరిజన విశ్వవిద్యాలయం ఉప కులపతి  ఆచార్య కట్టు మణి మాట్లాడుతూ,  మంచి విద్యను గిరిజనులకు అందించడం ద్వారా మాత్రమే వారి అభివద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.  గిరిజనులు ఏ పనిచేసినా, ఎన్ని పంటలు పండించినా విద్య లేకపొవడం వల్ల నష్ట పోతున్నారని అవేదన వ్యక్తం చేశారు. గిరిజన పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా ఉన్నత విద్య అభ్యసించాలని సూచించారు. 
 
 అధ్యక్షత వహించిన కళ్యాణ్ ఆశ్రమ్ రాష్ట్ర అధ్యక్షుడు చెడ్డా గోపీనాధ్ మాట్లాడుతూ, 11 రోజుల పాటు జరిగిన యాత్రకు మంచి స్పందన లభించిందని, 22 ప్రాంతాలలో సభలు జరిగాయని తెలిపారు. గిరజనేతరులలో గిరిజనుల పట్ల వున్న అపోహలను తొలగించి వారిలో సోదర భావం కల్పించడంలో యాత్ర విజయం సాధించిందని చెప్పారు. 
 
ఈ సందర్భమగా యాత్రలో క్రీయాశీలంగా వ్యవహరించిన శక్తి సంస్ధ నిర్వహకుడు డాక్టర్ పిరాట్ల శివరామకృష్ణ “గిరుల ఆరోగ్యమే పల్లపు ప్రాంతాల సౌభాగ్యం” పేరిట రాసిన తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ప్రసాద రెడ్డి, గిరిజన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కట్టు మణి ఆవిష్కరించారు. 
 
ఆశ్రమ్ జాతీయ నాయకుడు హెచ్ కే నాగు ఈ పుస్తకాలను పరిచయం చేశారు. ఈ సందర్భంగా శివరామకృష్ణ ను సన్మానించారు. జైపూర్ రాజమాత మాయాంక్ కుమారి దేవ్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు పాల్గొన్నారు. విమానం ఆలస్యమైన కారణంగా రాలేకపోయిన కేంద్ర గిరిజన శాఖామంత్రి అర్జున్ ముండా వీడియో ద్వారా సందేశాన్ని వినిపించారు. గిరిజనుల ధింసా నృత్యంతో కార్యక్రమం ప్రారంభమైంది.