`ప్రత్యక దేశంగా దక్షిణాది’.. కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై దుమారం

 
* మరోసారి దేశ విభజనకు కాంగ్రెస్ పన్నాగమంటూ బిజెపి మండిపాటు
 
నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని ఆరోపిస్తూ ఇలాంటి సమయంలో దేశాన్ని విడగొట్టి దక్షిణాది రాష్ర్టాలకు ప్రత్యేక దేశాన్ని ప్రకటించాలంటూ కాంగ్రెస్‌ ఎంపీ డీకే సురేశ్‌ పార్లమెంట్ లోవివాదాస్పద వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం పన్నులను దక్షిణాది నుంచి ఉత్తరాదికి మళ్లిస్తున్నదని పేర్కొంటూ దక్షిణాదిపై కేంద్రం వివక్షను ఇలాగే కొనసాగిస్తే, దక్షిణాది రాష్ర్టాల ప్రజల కోసం ప్రత్యేక దేశం డిమాండ్‌ తీసుకొస్తామని హెచ్చరించారు.
 
పైగా, ఆయన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు కావడం గమనార్హం. దక్షిణాది ప్రాంతంపై హిందీ ప్రాంతవాసులు చూపుతున్న వివక్ష కారణంగా వేరే గతి లేకనే ప్రత్యేక దేశం డిమాండ్‌ చేస్తున్నట్టు ఆయన తెలిపారు.  గురువారం కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ ప్రకటించిన సందర్భంగా సురేశ్‌ లోక్‌సభలో మాట్లాడుతూ  ‘గ్రాంట్ల వివక్షను సరిచేయకపోతే ప్రత్యేక దేశం ఇవ్వండి. గ్రాంట్లలో వివక్ష ఇలాగే కొనసాగితే దక్షిణ భారతీయులు ప్రత్యేక దేశం కోసం గళం విప్పడం అనివార్యమవుతుంది’ అంటూ అనుచిత వాఖ్యలు చేశారు.
`కేంద్ర నిధుల్లో మా వాటా మాకు అందడం లేదు. మా డబ్బును ఉత్తర భారతానికి ఇస్తున్నారు. దక్షిణాది రాష్ర్టాలకు అన్ని విషయాల్లోనూ కేంద్రం అన్యాయం చేస్తున్నది. హిందీ వాళ్లు మాపై పెత్తనం చేస్తున్నారు’ అని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దేశాన్ని మళ్లీ విభజించడానికి కాంగ్రెస్‌ భయంకరమైన పన్నాగాన్ని పన్నుతున్నదని ధ్వజమెత్తింది.
కాంగ్రెస్ విభజన వైఖరికి ఈ వాఖ్యలు అడ్డం పడుతున్నాయని రాజ్యసభ నాయకుడు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. రాజ్యాంగంపై దాడి, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అవమానించడమే కాకుండా ఈ ప్రకటనను విస్మరించలేమని గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు.

‘దేశప్రజలు తిరస్కరించడంతో కాంగ్రెస్‌ వేర్పాటువాదానికి మళ్లీ బీజం వేస్తున్నది. నెహ్రూ వారసత్వాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ సురేశ్‌ ప్రత్యేక దేశం డిమాండ్‌ను తెరమీదకు తీసుకొచ్చారు. ఒకవేళ కాంగ్రెస్‌ నేతలకు దేశంలో ఉండాలని లేకపోతే, వాళ్ల మాతృదేశం ఇటలీకి వెళ్లిపోవచ్చు’ అని ఎక్స్‌ వేదికగా బిజెపి భగ్గుమన్నది. సురేశ్‌ వ్యాఖ్యలపై ఎథిక్స్‌ కమిటీ విచారణ చేయించాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. 

దేశ విభజనపై ఎంపీ సురేశ్‌ చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి ఖండించారు. ఇది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనని స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలను నీరుగార్చడమేనని మండిపడ్డారు. సురేశ్‌పై పార్లమెంటరీ యాక్షన్‌ కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు. 

తామందరం దక్షిణ భారతదేశం నుంచి వచ్చిన వాళ్లమేనని ఈ సందర్భంగా జోషి గుర్తు చేశారు. తాము దేశాన్ని విభజించాలని అనుకోవడం లేదని, దక్షిణ, ఉత్తర భారతదేశం మొత్తం ఒకటిగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సురేశ్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సోనియా గాంధీ స్పందించి యావత్తు జాతికి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

దానితో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది. దేశ విభజనపై డీకే సురేశ్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను తాము ఎంతమాత్రం సహించబోయేది లేదని ఆయన తేల్చి చెప్పారు.  ఈ విషయమై తమ ఎంపీ టివి ద్వారా ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, తన ఉద్దేశ్యం అదికాదని వివరణ ఇచ్చారని అంటూ, ఈ అంశాన్ని లోక్ సభ ఎథిక్స్ కమిటీ పరిశీలించి, ఎవ్వరు అనుచితంగా మాట్లాడినా తగు చర్య తీసుకోవచ్చని ఖర్గే స్పష్టం చేశారు.

‘దేశాన్ని విడగొట్టాలంటూ మా పార్టీ నేతలే కాదు ఏ పార్టీవాళ్లు వ్యాఖ్యానించినా మేం ఎంత మాత్రం సహించబోం. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ మనమంతా ఒకటే. మనదంతా ఒకే దేశం. ఎప్పుడూ అలాగే ఉంటాం’ అని తేల్చి చెప్పారు. భారతీయుడినైనందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు.

పార్లమెంట్‌లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని సురేశ్‌కు కాంగ్రెస్‌ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌ హితవు పలికారు. సురేశ్‌ విభజన వ్యాఖ్యలపై శుక్రవారం పార్లమెంట్‌ దద్దరిల్లింది. కాంగ్రెస్‌ ఎంపీపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని డిమాండ్‌ చేశారు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం సురేశ్‌ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. నిధుల కేటాయింపుల విషయంలో బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై వివక్ష చూపిస్తున్నదన్న విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తాను ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొన్నారు.