కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా క‌ష్ట‌మే

కాంగ్రెస్‌కు 40 సీట్లు కూడా క‌ష్ట‌మే

* కాంగ్రెస్ నాయకత్వంపై నిప్పులు చెరిగిన మమతా

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బెంగాల్‌లో ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌న్న తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ కాంగ్రెస్‌పై మండిప‌డ్డారు. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు క‌నీసం 40 స్ధానాలు కూడా ద‌క్క‌డం అనుమాన‌మేన‌ని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌పై దీదీ విమ‌ర్శ‌ల‌తో విప‌క్ష ఇండియా కూట‌మిలో లుక‌లుక‌లు మ‌రింత ముదిరేలా ఉన్నాయి.

బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో శుక్ర‌వారం జరిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆమె మాట్లాడారు. 300 సీట్లలో మీరు (కాంగ్రెస్‌) క‌నీసం 40 స్ధానాలైనా గెలుస్తార‌నేది అనుమాన‌మే, అలాంటిది మీకెందుకింత అహంకార‌మ‌ని దీదీ నిల‌దీశారు. భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో భాగంగా రాహుల్ గాంధీ బెంగాల్‌లో అడుగుపెట్టినా త‌న‌కు స‌మాచారం ఇవ్వ‌లేద‌ని, ప్ర‌భుత్వ యంత్రాంగం నుంచి త‌న‌కు ఈ విష‌యం తెలిసింద‌ని ఆమె తెలిపారు.

దేశంలో 300 నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే తాను కాంగ్రెస్‌కు సూచించానని, దీన్ని పట్టించుకోవట్లేదని ఆమె తెలిపారు. అధిక స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తోందని, ఇది సరికాదని చెప్పారు. పూర్తిగా ముస్లిం ఓటు బ్యాంకు మీదే కాంగ్రెస్ ఆధారపడినట్టు కనిపిస్తోందని ఆమె ఆరోపించారు. పొత్తులో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో రెండు లోక్‌సభ స్థానాలను ఆఫర్ చేశానని, ఇంకా ఎక్కువ కోరారని గుర్తు చేశారామె.

”300 సీట్లలో పోటీ చేయమని కాంగ్రెస్‌కు చెప్పా. వాళ్లు వినలేదు. ఇప్పుడు ముస్లిం ఓటర్ల కోసం రాష్ట్రానికి (బెంగాల్) రెక్కలు కట్టుకుని వచ్చారు. 300 సీట్లలో కాంగ్రెస్ పోటీ చేస్తే కనీసం 40 స్థానాలైనా గెలుచుకుంటుందో లేదో అనుమానమే. ఇక్కడ రెండు సీట్లు (లోక్‌సభ) ఇస్తామని ఆఫర్ చేశాను. కానీ వాళ్లు మరిన్ని కావాలని అడిగారు. అప్పుడు ఒకే మాట చెప్పాను. 42 సీట్లలో పోటీ చేయమని అన్నాను. తోసిపుచ్చారు. అప్పట్నించి వాళ్లతో మాటలు జరిపిందే లేదు” అని మమత తెలిపారు.

‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ కోసం పశ్చిమబెంగాల్‌లోకి కాంగ్రెస్ అడుగుపెట్టినా ‘ఇండియా’ కూటమి భాగస్వామిగా తనకు కనీస సమచారం ఇవ్వలేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచే తనకు ఆ విషయం తెలిసిన మమత చెప్పారు. ర్యాలీ సజావుగా సాగేలా చూడాలని డెరిక్ ఒబ్రెయిన్‌ను కోరారని, అలాంటప్పుడు బెంగాల్ రావాల్సిన అవసరం ఏముందని ఆమె నిలదీశారు.

కాంగ్రెస్ యూపీ, రాజ‌స్ధాన్‌లో  గెలిచే ప‌రిస్ధితి లేద‌ని పేర్కొంటూ అల‌హాబాద్‌, వార‌ణాసిలో గెలిచి మీ పార్టీ స‌త్తా చాటాల‌ని ఆమె కాంగ్రెస్‌కు స‌వాల్ విసిరారు. రాహుల్ బీడీ కార్మికుల‌తో ఫొటో దిగిన అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఒక్కసారి కూడా టీ దుకాణానికి వెళ్ల‌ని వారు ఇప్పుడు బీడీ కార్మికుల‌తో కూర్చుంటున్నార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ఎద్దేవా చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయంగా కాంగ్రెస్ నేతలు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారని, ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ తనకు కనీస సమాచారం ఇవ్వట్లేదని మమత బెనర్జీ ఆరోపించారు. “మణిపూర్ మంటల్లో తగులబడుతున్నప్పుడు మీరెక్కడున్నారు? మేము ఒక టీమ్‌ను పంపాం. అక్కడ మహిళను వివస్త్రగా నడిపించారు. 200 చర్చిలు తగులబెట్టారు. ఇప్పుడు వాళ్లు టీ దుకాణాల దగ్గర ఫోటోషూట్స్‌లో పాల్గొంటున్నారు. వాళ్లు వలస పక్షులు” అంటూ కాంగ్రెస్‌పై మమత నిప్పులు చెరిగారు.