మోదీ క్రెడిట్ వల్లే చంపాయ్ సోరెన్ ముఖ్యమంత్రి

ప్రధాని నరేంద్ర మోదీ క్రెడిట్ వల్లే చంపయి సోరెన్‌ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి అయినట్టు బీజేపీ అభివర్ణించింది. దేశంలో ఆనువంశిక రాజకీయాలకు వ్యతిరేకమైన వాతావరణం ఉండటం వల్లే చంపయి సోరెన్ ముఖ్యమంత్రి అయినట్టు జార్ఖాండ్ అసెంబ్లీలో విపక్ష నేత అమర్ కుమార్ బావురీ స్పష్టం చేశారు.

జార్ఖాండ్‌లో చేటుచేసుకున్న అనూహ్య పరిణామాల మధ్య జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపయి సోరెన్ ముఖ్యమంత్రిగా శుక్రవారంనాడు ప్రమాణస్వీకారం చేశారు. ఈడీ అరెస్టుతో ముఖ్యమంత్రికి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడం, జేఎంఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన చంపయి సోరెన్ కొత్త సీఎంగా పగ్గాలు చేపట్టడం వంటి పరిణామాలు వేగంగా చోటుచేసుకున్నాయి.  తొలుత హేమంత్ సొరేన్ భార్య ముఖ్యమంత్రి కాబోతున్నట్లు కధనాలు వెలువడటం గమనార్హం.

నాలుగేళ్ల క్రితం హేమంత్ సోరెన్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిందని, అప్పట్నించి ప్రభుత్వం అనేక లీగల్ చిక్కుల్లో పడిందని బవురి తెలిపారు. చంపయి సోరెన్ ముఖ్యమంత్రి కావడానికి ఇదొక కారణమని పేర్కొన్నారు. దీనికి మరో ప్రధాన కారణంగా ఉందని, ఆనువంశిక పాలనను ప్రధాని మోదీ మొదట్నించీ వ్యతిరేకిస్తూ వచ్చారని, ఇప్పుడు అలాంటి వాతావరణమే దేశమంతటా ఉందని చెప్పారు. ఆ కారణంగానే  చంపాయ్ సోరెన్ సీఎం అయ్యారని, ఆ క్రెడిట్ మోదీకి దక్కుతుందని చెప్పారు.

కాగా, జార్ఖండ్‌ రాష్ర్టాభివృద్ధికి కట్టుబడి ఉంటానని, హేమంత్‌ సొరేన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కొనసాగిస్తానని ప్రమాణ స్వీకారం అనంతరం చంపాయ్ సోరెన్ మీడియాకు తెలిపారు. కుట్ర చేసి ఒక గిరిజన సీఎంను ఎలా అరెస్ట్‌ చేశారో దేశమంతా చూస్తున్నదని చెప్పారు. అనంతరం తొలిసారిగా చంపయీ నేతృత్వంలో సమావేశమైన మంత్రివర్గం ఈ నెల 5న అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమవ్వాలని నిర్ణయించింది.