బీజేపీ దిగ్గజ నేత ఎల్​కే అద్వానీకి భారత రత్న

మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

“శ్రీ ఎల్​కే అద్వానీకి భారత రత్న పురస్కారాన్ని ఇస్తున్నామని ప్రకటించడం నాకు సంతోషంగా ఉంది. పురస్కారం ఇస్తున్నామని ఆయనకు ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపాను. భారత దేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్ఫూర్తిదాయకం. క్షేత్రస్థాయి కార్మికుడి స్థాయి నుంచి భారత దేశ ఉపప్రధానిగా ఎదిగారు ఆయన. హోంమంత్రి, ఐబీ శాఖ మంత్రిగానూ పనిచేశారు” అంటూ ప్రధాని మోదీ తెలిపారు. 

“పార్లమెంట్​లో ఆయన పనితీరు ఎందరినో ప్రభావితం చేసింది. పారదర్శకత, సమగ్రతతో.. దశాబ్దాల పాటు ఆయన ప్రజా సేవ చేశారు. అందరు గౌరవించే రాజనీతిజ్ఞుడు అద్వానీ. దేశ ఐకమత్యానికి ఎంతో కృషి చేశారు. అద్వానీకి భారత రత్న లభించడం నాకు నిజంగా భావోద్వేగమైన విషయం. ఆయనతో అనేకమార్లు మాట్లాడే అవకాశం నాకు లభించడం ఒక ప్రివిలేజ్​గా భావిస్తున్నాను. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను,” అని ప్రధానమంత్రి నరేంద్ మోదీ ట్వీట్​ చేశారు.

 

96ఏళ్ల అద్వానీ కొన్నేళ్ల క్రితం వరకు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహించారు. 1970 నుంచి 2019 వరకు పార్లమెంట్​ సభ్యుడిగా వ్యవహించారు. భారతీయ జనసంఘ్ రోజుల నుండి మాజీ ప్రధాని వాజపేయితో కలిసి ప్రజా జీవనంలో పనిచేస్తూ వచ్చిన ఆయన మంచి పత్రికా రచయిత కూడా. 

భారతీయ జనసంఘ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడే ఎమర్జెన్సీ వచ్చి జైలుకు వెళ్లారు. ఆ తర్వాత 1977 ఎన్నికలలో ఏర్పడిన తొలి కాంగ్రెసేతర మొరార్జీ దేశాయి ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే జనసంఘ్ ను జనతా పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత 1980లో వాజపేయితో కలిసి భారతీయ జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర వహించారు. 

సుదీర్ఘకాలం బీజేపీని దేశవ్యాప్తంగా విస్తరింప చేయడంలో క్రియాశీలకంగా పనిచేశారు. సుదీర్ఘకాలం ఆ పార్టీ అధ్యక్షునిగా పనిచేశారు. రథయాత్ర చేపట్టడం ద్వారా రామ​ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. అటల్​ బిహారీ వాజ్​పేయి ప్రభుత్వంలో హోంశాఖ నిర్వహిస్తూ ఉప ప్రధానిగా పనిచేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష నేతగా కూడా పనిచేశారు.

బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీ బీజేపీకి అత్యధికకాలం అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత వహించారు. 1980లో పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి అత్యధిక కాలం అధ్యక్షుడిగా కొనసాగారు. ఇక అటల్ బిహారీ వాజ్‌పేయి సారధ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన 90వ దశకంలో బీజేపీ ఎదుగుదల కోసం ఎల్‌కే అద్వానీ విశేష కృషి చేశారు. 2002-04 వరకు అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని మంత్రివర్గంలో ఉప ప్రధానిగా దేశానికి సేవలు అందించారు.

ఇటీవలె బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డును ప్రకటించింది. తాజాగా ఎల్‌కే అద్వానీ పేరును దేశ అత్యున్నత పౌర పురస్కారం కోసం ఎంపిక చేసింది.