జీవిత ఆదర్శాలు, సిద్ధాంతాలకు ఇదో గౌరవం

సీనియర్ బిజెపి నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ తనకు ప్రదానం చేసిన భారతరత్న “ఇది ఒక వ్యక్తిగా నాకు మాత్రమే కాకుండా, నా జీవితాంతం నా సామర్థ్యం మేరకు సేవ చేయడానికి నేను ప్రయత్నించిన ఆదర్శాలు, సూత్రాలకు కూడా గౌరవం” అని తెలిపారు. “అత్యంత వినయం, కృతజ్ఞతతో, ఈ రోజు నాకు ప్రదానం చేసిన భారతరత్నను నేను అంగీకరిస్తున్నాను” అని ఒక ప్రకటనలో తెలిపారు.
 
ఈ అత్యున్నత పౌర పురస్కారం ప్రకటించిన సందర్భంగా తాను సన్నిహితంగా పనిచేసిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో స్మరించుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ పురస్కారం ప్రకటించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీలకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. 
 
 తన ప్రజా జీవితంలో కలిసి పనిచేసిన లక్షలాది మంది బిజెపి కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ స్వయంసేవక్ లు, ఇతరులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “నేను నా కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా నా ప్రియమైన నన్ను విడిచి ముందే వెళ్ళిపోయినా భార్య కమల పట్ల నా లోతైన భావాలను కూడా వ్యక్తం చేస్తున్నాను. వారు నా జీవితంలో గొప్ప బలం, జీవనోపాధికి మూలం” అని ఆయన చెప్పారు.
 
“మన గొప్ప దేశం కీర్తి శిఖరాగ్రానికి పురోగమిస్తుంది” అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.  ముకుళిత హస్తాలతో కూతురితో కలిసి అద్వానీ మీడియా ముందుకు వచ్చారు. అద్వానీ ఒక ప్రకటనలో “నేను 14 సంవత్సరాల వయస్సులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరినప్పటి నుండి, నేను జీవితంలో నాకు అప్పగించిన ఏ పనిలోనైనా నా ప్రియమైన దేశానికి అంకితభావంతో, నిస్వార్థ సేవలో సేవలు అందించాను” అని తెలిపారు. 
 
ఈ జీవితం నాది కాదు.. నా జీవితం నా దేశం కోసమే”  అనే నినాదం నా జీవితంలో స్ఫూర్తిని నింపిందని అద్వానీ చెప్పారు. ఈ పురస్కారం పట్ల ఆయన కుటుంభం సభ్యులు సహితం సంతోషం ప్రకటించారు. ముకుళిత హస్తాలతో కూతురితో కలిసి అద్వానీ మీడియా ముందుకు వచ్చారు.
 
అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ మాట్లాడుతూ.. ‘దాదా (అద్వానీ)కి దేశ అత్యున్నత గౌరవం లభించినందుకు మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా అమ్మను చాలా మిస్‌ అవుతున్నాను. ఎందుకంటే మా నాన్న వ్యక్తిగత జీవితం, రాజకీయ జీవితంలో ఆమె చేసిన సహకారం చాలా గొప్పది. అవార్డు ప్రకటించడంపై నేను దాదాకి చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషించారు. ఆ సమయంలో ఆయన కళ్లలో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. ఆయన జీవితమంతా దేశ సేవలోనే గడిపారు’ అంటూ అద్వానీ కుమార్తె ప్రతిభా అద్వానీ చెప్పుకొచ్చారు.
తన జీవితంలో ఈ దశలో ఆయన చేసిన కృషికి గానూ ఇంతటి ఘనమైన గుర్తింపు లభించడం అద్భుతమని ఎల్‌కే అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ తెలిపారు. ‘ఈ కొత్త పరిణామంతో నేను, నా కుటుంబం చాలా సంతోషిస్తున్నాము. మా నాన్నకు ఈ అవార్డును ప్రదానం చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రజా జీవితంలో మా నాన్న సహకారం అపారమైనది. ఈ దశలో ఆయన చేసిన కృషికి ఇంతటి ఘనమైన గుర్తింపు లభించడం చాలా అద్భుతంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.


ఇది ‘డబుల్ ధమాకా’ లాంటిది. జనవరి 22న రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠ జరిగింది. ఫిబ్రవరి 3న ఆయనకు భారతరత్న పురస్కారం లభించింది. రామమందిర ఉద్యమంలో ఆయనకు అనుబంధం ఉంది. ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ సంతోషం వ్యక్తం చేశారు.
 
అద్వానీకి అవార్డు రావడంపై పలువురు బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు హర్షం ప్రకటించారు. “ఇది మనందరికీ గర్వకారణం. అద్వానీ తన జీవితాన్ని దేశం కోసం, సమాజం కోసం అంకితం చేశారు. బీజేపీ విస్తరణలో అటల్ జీ, అద్వానీ కీలక పాత్ర పోషించారు. వాళ్లిద్దరితో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టం. భగవంతుడు ఆయనకు దీర్ఘాయుష్షును ప్రసాదిస్తారని, ఆయన మాకు మార్గదర్శకత్వం చేస్తూనే ఉంటారని భావిస్తున్నాను” అని  కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హర్షం ప్రకటించారు.