
విజయనగరం జిల్లా బొండపల్లి తహశీల్దార్ రమణయ్య విశాఖలోని కొమ్మాదిలో చొరన్ క్యాపిటల్ అపార్ట్ మెంట్ వద్ద దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసం ఉండే చరణ్ క్యాజిల్ అపార్ట్‌మెంట్ గేట్ వద్ద దుండగులు శుక్రవారం రాత్రి ఇంటి బైటకు పిలిపించి, ఇనుప రాడ్‌తో దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.
వాచ్ మెన్ కేకలు వేయటంతో దుండగులు అక్కడ్నుంచి పరారీ అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ మృతి చెందారు. తహసీల్దార్‌పై రాడ్‌తో దాడి చేసిన సమయంలో దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. విశాఖ రూరల్ తహసీల్దార్‌గా పనిచేసిన రమణయ్య ఇటీవల విజయనగరం జిల్లా బంటుమిల్లికి బదిలీ అయ్యారు. శుక్రవారం ఉదయమే బాధ్యతలు కూడా స్వీకరించారు
ఎమ్మార్వో హత్య కేసులో నిందితుణ్ని గుర్తించినట్లు వైజాగ్ పోలీసులు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ అంశాలే ఎమ్మార్వో రమణయ్య హత్యకు దారితీసినట్లు వైజాగ్ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ వెల్లడించారు.
” ఎమ్మార్వో రమణయ్య ఇంటి ముందు ఇద్దరితో మాట్లాడుతుండగా దుండగుడు రాడ్‌తో దాడిచేశాడు. రాత్రి పదిగంటల సమయంలో ఈ ఘటన జరిగింది. దాడి జరిగిన విషయమై వెంటనే మాకు సమాచారం వచ్చింది. సమాచారం రాగానే ఘటనాస్థలికి చేరుకున్నాం . సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాం. ఎమ్మార్వో ఆఫీసు సిబ్బందిని విచారించాం. అప్పటివరకూ సేకరించిన ఆధారాల నిందితుడిని గుర్తించాం” అని తెలిపారు.
“ఎమ్మార్వో సనపాల రమణయ్యకు, నిందితుడికి రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. దీనికి సంబంధించి నిందితుడు ఎమ్మార్వో ఆఫీసుకు కూడా వెళ్లినట్లు గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీ కూడా దొరికింది. ఘటన తర్వాత నిందితుడు ఎయిర్ పోర్టు వైపు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజిలో తేలింది. రైల్వే టికెట్లు కూడా బుక్ చేశాడు”.. అని సీపీ రవిశంకర్ వివరించారు.
మరోవైపు నిందితుడికి సంబంధించిన వాట్సాప్ సమాచారం కూడా సేకరించినట్లు వైజాగ్ సీపీ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పది బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతానికి నిందితుడు వైజాగ్ దాటి వెళ్లాడన్న సీపీ.. ఎక్కడున్నా కూడా త్వరలోనే అరెస్ట్ చేసి తీరుతామని స్పష్టం చేశారు.
విశాఖలో జరిగిన ఈ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. విశాఖలో శాంతి భద్రతలు లోపించాయంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. రెవెన్యూ ఉద్యోగుల సంఘం కూడా హత్యను తీవ్రంగా ఖండించింది. నల్లబ్యాడ్జీలకు విధులకు హాజరవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు 24 గంటలు గడవకముందే హత్యచేసిన నిందితుణ్ని గుర్తించారు.
మండల మేజిస్ట్రేట్ కే ఈ దుర్గతి పడితే సామాన్యుల పరిస్థితి ఏంటని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ప్రశ్నించారు. ప్రశాంతతకు నిలయమైన ఉత్తరాంధ్రలో గతంలో ఎన్నడూ ఇలాంటి దారుణం జరగలేదని చెబుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ‘రాష్ట్రమంతా రాజారెడ్డి రాజ్యాంగం, పులివెందుల పంచాగం’ అమలవుతోందని ఆరోపించారు.
More Stories
పాకిస్థాన్ సహా 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్
తమిళనాడులో రూ.1000 కోట్ల లిక్కర్ స్కామ్!
15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు