హైదరాబాద్‌ చేరుకున్న జార్ఖండ్‌ జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

* అంతర్గత విభేదాలను కప్పిపుచ్చే రాజకీయ ఎత్తుగడ… బిజెపి 

జార్ఖండ్ రాజకీయం తెలంగాణకు చేరింది. జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ మనీ లాండరింగ్‌ కేసులో అరెస్ట్ కావడంతో తన పదవికి  రాజీనామా చేశారు. దానితో శుక్రవారం  ఉదయం జేఎంఎం ఉపాధ్యక్షుడు చంపాయ్‌ సోరెన్‌ జార్ఖండ్‌ ముఖ్యమంత్రిగా  ప్రమాణస్వీకారం చేశారు.  జార్ఖండ్‌ అసెంబ్లీలో బలనిరూపణ కోసం అధికార కూటమికి ఈ సందర్భంగా ఆ రాష్ట్ర గవర్నర్‌ పది రోజుల గడువు ఇచ్చారు.

ఆయ‌న ఈ నెల అయిదో తేదిన అక్క‌డ అసెంబ్లీలో బ‌ల ప‌రీక్ష‌ను ఎదుర్కొనున్నారు. ఈ నేప‌థ్యంలో ఎఎంఎం , కాంగ్రెస్ కు చెందిన 43 మంది ఎమ్మెల్యేల‌తో చంపై క్యాంప్ రాజ‌కీయాల‌కు తెర‌తీశారు. అధికార జెఎంఎం కూట‌మిలో కాంగ్రెస్ కూడా ఉండ‌టంతో ఎమ్మెల్యేల‌ను హైద‌రాబాద్ క త‌ర‌లించారు. ఈ నేపథ్యంలో నూతన ముఖ్యమంత్రి తన సంకీర్ణ సర్కారులోని జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించారు. 

రెండు ప్రత్యేక విమానాల్లో బేగంపేట్ కు చేరుకున్న జార్ఖండ్  జేఎంఎం, కాంగ్రెస్‌ ఎమ్యెల్యేలకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపదాస్ మున్షీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిని ప్రత్యేక బస్సుల్లో రెండు వేర్వేరు హోటల్స్‌కు తరలించారు.  ఎమ్మెల్యేలకోసం  శామీర్ పేట్ లోని లియోనియో హోటల్, గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో వసతి ఏర్పాటు చేశారు.

కాగా, ఇక్క‌డ‌కు వ‌చ్చిన ఎమ్మెల్యేలు చేజార‌కుండా కాంగ్రెస్ పార్టీ భాద్య‌త‌లు తీసుకుంది. ఈ క్యాంప్ కు మంత్రి పొన్నం ప్రభాకర్, సంపత్ కుమార్ లకు కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించారు.  బలనిరూపణ తేదీ వరకూ వారంతా హైదరాబాద్ లోనే ఉంటారు.  వాస్తవానికి జెఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గురువారమే హైదరాబాద్ రావలసి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో వారు బుక్ చేసుకున్న ప్రత్యేక విమానం రద్దయింది. దీంతో శుక్రవారం ఉదయం వారు హైదరాబాద్ కు బయల్దేరారు.

తాజాగా శుక్రవారం సాయంత్రం జార్ఖండ్‌ ప్రభుత్వ నూతన క్యాబినెట్‌ తొలిసారి సమావేశమైంది. సీఎం చంపాయ్‌ సోరెన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ఈ నెల 5, 6 తేదీల్లో అసెంబ్లీని సమావేశపర్చాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో చంపాయ్‌ సోరెన్‌ బలపరీక్ష నెగ్గాల్సి ఉంటుంది. 82 మంది ఎమ్మెల్యేలున్న జార్ఖండ్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 41. బిజేపికి 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జెఎంఎంకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బిజేపీతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. తమకు 47మంది ఎమ్మెల్యేల బలం ఉందని చంపై సోరెన్ గవర్నర్ కు లేఖ ఇచ్చారు.

ఇదిలా ఉండగా, జార్ఖండ్‌లోని జేఎంఎం నేతృత్వంలోని కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు తరలించడం జేఎంఎం, కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత విభేదాలను కప్పిపుచ్చే రాజకీయ ఎత్తుగడగా జార్ఖండ్ బీజేపీ అభివర్ణించింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆరోపణను ఆ పార్టీ తిప్పికొట్టింది.

 “జేఎంఎం నేతృత్వంలోని కూటమికి బిజెపి నుండి ఎలాంటి ముప్పు లేదు. ఇరు పార్టీల మధ్య మంత్రి పదవులు, సీట్ల పంపకంపై సయోధ్య కుదరలేదు. దీంతో వారు తమ అంతర్గత విభేదాలను దాచడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల దృష్టి మరలడానికే బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారు” అంటూ  బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేత అమర్ బౌరీ ఆరోపించారు.

“నాలుగేళ్ల క్రితం హేమంత్ సోరెన్ ప్రభుత్వం అనేక న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకుంది. దీనికితోడు కుటుంబ పాలన చెదపురుగు లాంటివని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతూ వస్తున్నారు. దేశంలో రాజవంశ రాజకీయాలకు వ్యతిరేకంగా వాతావరణం నెలకొనడంతో చంపై సోరెన్ సీఎం అయ్యారు’’ అని గుర్తు చేశారు.