బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ డూప్ ఫైటింగ్

బీఆర్ఎస్‌తో కాంగ్రెస్ డూప్ ఫైటింగ్ చేస్తోందని, ఆ పార్టీ అవినీతిపై విచారణ చేయడం లేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి  మండిపడ్డారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేశారని, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఖమ్మం జిల్లాకు కు చెందిన కాంగ్రెస్ నేతలు అంకిరెడ్డి సుదీర్ రెడ్డి, బొల్లపు సురేందర్ రెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీ చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ డైరీని కూడా ఆయన ఆవిష్కరించారు. 2024 సంవత్సర డైరీని బిజెపి  రాష్ట్ర పిఆర్ఓ పరమేశ్వర్ అందజేయగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్ బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేస్తామని చెప్పారని కిషన్‌రెడ్డి గుర్తు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో హైదరాబాద్ రింగ్ చుట్టూ జరిగిన భూలావాదేవీల మీద విచారణ చేయాలని, కానీ కాంగ్రెస్ విచారణ చేస్తోందని తాను అనుకోవడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ మీద కోపంతో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని చెబుతూ అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ గెలుపు కాదని, బీఆర్ఎస్ ఓటమి అని స్పష్టం చేశారు. తెలంగాణలో అత్యధిక లోక్‌సభ స్థానాలు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువత, రైతులు, రైతు కూలీలు దేశం కోసం బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదని, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదని కిషన్‌రెడ్డి తెలిపారు.  ఎన్నికల వాగ్దానంలో భాగంగా  ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని అట్టహాసంగా వార్తా పత్రికల మొదటి పేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా?  అని ప్రశ్నించారు. 

మరి మొన్ననే ఒకటో తేది.. ఇది ఫిబ్రవరి నెలే కదా అని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సమయం దాటిపోయింద‌ని, మరి ఇంతవరకైతే నోటిఫికేషన్ రాలేదని కేంద్రమంత్రి గుర్తు చేశారు. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిందని ధ్వజమెత్తారు. యువతను మోసం చేసినట్లే.. ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నం జరుగుతోందని కిషన్ రెడ్డి మండిప‌డ్డారు.