కృష్ణా బోర్డుకే ప్రాజెక్టుల నిర్వాహణకు ఒప్పుకున్న తెలుగు రాష్ట్రాలు

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నిర్వాహణను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. గురువారం ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగింతపై జలసౌధలో కేఆర్‌ఎంబీ సమావేశం జరిగింది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ నెల 17న ఢిల్లీలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఈ సమావేశం జరిగింది. 
 
ఈ సందర్భంగా ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు అంగీకరించాయి. అలాగే నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దీంతో వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీనే తుది నిర్ణయం తీసుకోనుంది. బోర్డు పరిధిలో మొత్తం 15 ఓటిస్‌లలో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్‌వి ఉన్నాయని ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు.
ఆపరేషనల్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుందని, నీటి కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయమని తెలిపారు. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారని పేర్కొన్నారు. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి 2 టీఎంసీ, మార్చ్‌లో రైట్ మెన్ కెనాల్ నుంచి 3 టీఎంసీ ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారని చెప్పారు.
ఏప్రిల్‌లో 5 టీఎంసీలు ఏపీకి ముందుగానే ఉన్నాయని చెబుతూ ప్రాజెక్టుల ఆపరేషనల్ కోసం తెలంగాణ ఒప్పుకుందని తెలిపారు. ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్‌ఎంబీకి ఇవ్వడం జరిగిందని తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్ కూడా చెప్పారు. అయితే, విద్యుత్ కేంద్రాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుందని చెప్పారు. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయని స్పష్టం చేశారు. 
తాజాగా కేంద్రజల్‌శక్తిశాఖ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టుల అప్పగింత అంశంపై ఇరు రాష్ర్టాలతో కేఆర్‌ఎంబీ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ మార్గదర్శకాల మేరకు ప్రాజెక్టులను అప్పగించాలని కేఆర్‌ఎంబీ చైర్మన్‌ శివనందన్‌కుమార్‌ ఇరు రాష్ర్టాలకు సూచించారు. అయితే ఏపీ అందుకు అంగీకారం తెలిపినా, తెలంగాణ అప్పగిస్తేనే తాము ప్రాజెక్టులను అప్పగిస్తామని షరతును పెట్టింది.
దీనిపై తెలంగాణ తొలుత ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ను ఖరారు చేయాలని, నీటి వాటాలను తేల్చాలని, ఇప్పటికే ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖరాసిందని వెల్లడించింది. తెలంగాణ లేవనెత్తిన అంశాలకు కేంద్రం నుంచి స్పష్టత వచ్చిన తరువాత, ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ను నిర్ధారించిన అనంతరమే ప్రాజెక్టులను అప్పగిస్తామని తెలియజేసింది. అయితే తెలంగాణ ప్రతిపాదనలను కేఆర్‌ఎంబీ చైర్మన్‌ తోసిపుచ్చారు.
ప్రస్తుతం ఆపరేషన్‌ ప్రొటోకాల్‌ అంశం ట్రిబ్యునల్‌ ముందు ఉన్నదని, సబ్‌జ్యూడిస్‌ మ్యాటర్‌ను ఇక్కడ ప్రస్తావించవద్దని, కేంద్రం వద్దనే తేల్చుకోవాలని తేల్చిచెప్పారు. కేంద్ర జల్‌శక్తిశాఖ సూచనల మేరకు కేవలం ప్రాజెక్టుల అప్పగింత అంశానికే పరిమితం కావాలని స్పష్టం చేశారు. దీంతో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్దేశించిన ప్రాజెక్టులు, ఔట్‌లెట్లలో విద్యుత్తు ప్రాజెక్టులను మినహాయించి మిగతా ప్రాజెక్టులను అప్పగించేందుకు తెలంగాణ అంగీకారం తెలిపింది.

నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుందని, ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని భట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుందని చెప్పుకొచ్చారు. కేఆర్‌ఎంబీ పరిధిలో ఉన్న 15 ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్తాయని తెలిపారు.  ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదని,  ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుందని తెలిపారు. సీఆర్‌పీఎఫ్ కూడా కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయని,  నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40 : 45 కావాలని అడుగుతున్నారని వెల్లడించారు.