మహిళలు, యువత, రైతులు, గ్రామీణ ప్రాంతాలపై బడ్జెట్ దృష్టి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో మహిళలు, యువత, రైతులు, గ్రామీణ ప్రాంతాల ప్రజలను దృష్టిలో
పెట్టుకొని సంక్షేమ పథకాలను ప్రకటించారు. తొమ్మిది కోట్ల మంది మహిళలతో అనుసంధానమైన 83 లక్షల స్వయం సహాయక బృందాలు కోటి మంది మహిళలను లఖ్‌పతి దీదీగా మార్చడంలో
సహాయపడ్డాయని తెలిపారు. లఖ్‌పతి దీదీ లక్ష్యాన్ని రూ.2కోట్ల నుంచి రూ.3కోట్లకు పెంచాలని
నిర్ణయించా

10 లక్షల ఉపాధి అవకాశాలు

ప్రధాన మంత్రి కిసాన్ సంపద యోజన ద్వారా 38 లక్షల మంది రైతులు లబ్ధి పొందారని ఆర్ధిక మంత్రి తెలిపారు. 10 లక్షల ఉపాధి అవకాశాలు సృష్టించామని, వ్యవసాయ రంగంలో ప్రైవేట్, ప్రభుత్వ రంగ భాగస్వామ్యాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు. గిడ్డంగులు, ప్రాసెసింగ్‌ కోసం ఆర్థిక సాయం అందజేస్తామని, నూనెగింజల స్వయంసమృద్ధి కోసం కొత్త పథకం తీసుకువస్తామని తెలిపారు. 

కొత్త వ్యవసాయ సాంకేతికత, వ్యవసాయ బీమాను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. పాడి రైతుల కోసం రాష్ట్రీయ డైయిరీ ప్రాసెస్‌, గోకుల్ మిషన్ వంటి పథకాల ద్వారా సహాయం అందజేస్తామని, మత్స్య సంపద పెంచేందుకు కృషి చేస్తామని చెప్పారు. మత్స్య ఉత్పత్తి రెట్టింపు అయ్యిందన్న ఆర్థిక మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా హెక్టారుకు మూడు నుంచి ఐదు టన్నుల వరకు ఉత్పాదకత పెరుగుతుందని వెల్లడించారు.

కొత్త ఉపాధి అవకాశాలు

కొత్తగా 55లక్షల ఉపాధి అకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఐదు ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. స్కిల్ ఇండియా మిషన్ కింద దేశంలో 1.4 కోట్ల మంది యువతకు శిక్షణ ఇచ్చామని ఆర్థిక మంత్రి తెలిపారు. 54 లక్షల మంది అప్‌స్కిల్, రీ-స్కిల్డ్‌గా ఉన్నారని, దేశంలో కొత్తగా 3వేల ఐటీఐలు ఏర్పాటయ్యాయని చెప్పారు. 

అంతేకాకుండా దేశంలో ఏడు ఐఐటీలు, 16 ఐఐఐటీలు, ఏడు ఐఐఎంలు, 15 ఎయిమ్స్, 390 యూనివర్సిటీలు ఏర్పాటయ్యాయనివివరించారు .  మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్‌లో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం మార్చి 2025 వరకు
అందుబాటులో ఉంటుంది. గరిష్ఠంగా రూ.2లక్షలను మహిళలు, బాలికల పేరిట 7శాతం వడ్డీ రేటుతో రెండేళ్లపాటు డిపాజిట్ చేసుకునేందుకు వీలుంటుంది.

స్వయం సహాయక సంఘాలకు

దీన్‌దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ఏర్పడిన 81 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. స్వయం సహాయక బృందాలను విలీనం చేసి, వాటికి ముడిసరుకును అందించడం ద్వారా డిజైన్, నాణ్యత,
బ్రాండింగ్, మార్కెటింగ్‌లో శిక్షణ ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసే సంస్థలుగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని మూడు కోట్ల మంది మహిళా రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.54 వేల కోట్లు జమ అయ్యాయన్నారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బడ్జెట్‌లో మొత్తం రూ.25,448 కోట్లు కేటాయించారు. లింగ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు రూ.2,23,219 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

రైతులు, గ్రామస్తుల సంక్షేమానికి పెద్దపీట

రైతుల కోసం వ్యవసాయ యాక్సిలరేటర్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని గత బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత స్టార్టప్‌లను ప్రోత్సహిస్తామన్నారు. భారతదేశాన్ని అన్నశ్రీకి గ్లోబల్ హబ్‌గా మార్చడానికి హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్‌లో పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. 

పశుపోషణ, పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమలకు రూ.20 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రుణాన్ని ప్రకటించారు. అలాగే, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూ.6,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మత్స్యకారులు, చేపల విక్రయదారులు, చేపల పెంపకానికి సంబంధించిన చిన్న మరియు మధ్య తరహా వ్యాపారులకు సరఫరా గొలుసును విస్తరించడంలో
సహాయపడుతుందని వివరించారు.

11.4కోట్ల రైతుల ఖాతాల్లో కిసాన్‌ సమ్మాన్‌

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలోని 11.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2.2 లక్షల కోట్లు జమ అయ్యాయని పేర్కొన్నారు. అగ్రి టెక్ ఆధారిత అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు, అభివృద్ధి చేయడానికి దేశంలోని 63 వేల ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను రూ.2516 కోట్లతో కంప్యూటరీకరించనున్నట్లు తెలిపారు. 

వికేంద్రీకృత నిల్వ సామర్థ్యాన్ని రైతుల కోసం గోబర్ధన్ పథకం కింద కొత్తగా 500 వేస్ట్ టు వెల్త్ బయోగ్యాస్ ప్లాంట్‌లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం రూ.10వేల కోట్లు కేటాయించారు. ఈజీఎస్‌ పథకానికి రూ.25వేలకోట్ల బడ్జెట్‌ను ప్రకటించారు.

 అలాగే, సక్షం అంగన్‌వాడీ అండ్ న్యూట్రిషన్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్, సమగ్ర శిక్షా యోజన, సమర్థ్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ కింద రూ.45 వేల కోట్లు కేటాయించారు. వచ్చే మూడేళ్లలో కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు వీలుగా 10 వేల బయో ఇన్‌పుట్‌ రిసోర్స్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

రైతులు, వ్యవసాయ రంగానికి రూ.1.27లక్షలకోట్లు 

బడ్జెట్‌లో వ్యవసాయ, రైతు సంక్షేమానికి రూ.1.27 లక్షల కోట్లు కేటాయించారు. రైతులే మన ‘అన్నదాతలు’ అని ఆర్థికమంత్రి తన ప్రసంగంలో పేర్కొంటూ పీఎం-కిసాన్ సమ్మాన్ యోజన కింద, సన్నకారు, చిన్న రైతులతో సహా 11.8 కోట్ల మంది రైతులకు ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు
 
. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద 4 కోట్ల మంది రైతులకు పంటల బీమా కల్పించినట్లు తెలిపారు. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ 1,361 మండీలను ఏకీకృతం చేసి రూ.3లక్షల కోట్ల విలువైన టర్నోవర్‌ను నిర్వహిస్తోందని చెప్పారు.  బడ్జెట్‌లో కీలక విషయాల్లో కోత అనంతరం కార్యకలాపాల్లో ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యంలో పెట్టుబడులు ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. నానో-డీఏపీ వినియోగం అన్ని ఆగ్రో క్లైమెటిక్‌ జోన్స్‌కు విస్తరించన్నట్లు పేర్కొన్నారు. 
నూనెగింజల విషయంలో స్వావలంభన సాధించేందుకు ‘ఆత్మనిర్భర్‌ ఆయిల్‌ సీడ్‌’ కార్యక్రమాన్ని తెలిపారు. డెయిరీ అభివృద్ధికి సమగ్ర కార్యక్రమం రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆక్వాకల్చర్‌ ఉత్పాదకతను పెంచేందుకు, రెట్టింపు ఎగుమతులు, మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజనను మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. దేశవ్యాప్తంగా ఐదు ఆక్వా పార్క్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు.
 కొత్తగా గృహ నిర్మాణ విధానం
 
మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. బస్తీలు, అద్దె ఇండ్లల్లో ఉండే వారి సొంతింటి కలను నెరవేరుస్తామని ప్రకటించారు. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుందని వెల్లడించారు.  మధ్య తరగతి కోసం కోసం కొత్తగా గృహ నిర్మాణం విధానం తీసుకురాబోతున్నామని తెలిపారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్‌ యోజన ఇండ్లలో 70శాతం మహిళల పేరుపైనే ఇచ్చామని చెప్పారు. కరోనా కారణంగా సవాళ్లు ఉన్నప్పటికీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అమలు కొనసాగించామని తెలిపారు.  3 కోట్ల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి దగ్గరగా ఉన్నామని చెబుతూ రాబోయే ఐదు సంవత్సరాల్లో మరో 2 కోట్ల ఇళ్లు మంజూరు చేస్తామని ఆమె ప్రకటించారు.

గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ నిర్మూల‌న కోసం టీకాలు

గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ నిర్మూల‌నే ల‌క్ష్యంగా టీకా కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్ట‌నున్న‌ట్లు  నిర్మ‌లా సీతారామ‌న్ తెలిపారు. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలిక‌ల‌కు ఆ టీకాలు ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు..ప్ర‌సూతి, శిశు సంర‌క్ష‌ణ కోసం అనేక స్కీమ్‌ల‌ను ఒకే స‌మ‌గ్ర‌మైన ప్రోగ్రామ్ కింద‌కు తీసుకురానున్న‌ట్లు మంత్రి చెప్పారు. 

ఇమ్యూనైజేష‌న్ కోసం కొత్త‌గా డిజైన్ చేసిన యూ-విన్ ప్లాట్‌ఫామ్‌ను కూడా వాడుక‌లోకి తీసుకురానున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. అంగ‌న్‌వాడీల‌ను అప్‌గ్రేడ్ చేయ‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. ఆర్థిక మంత్రి చేసిన ప్ర‌క‌ట‌న‌కు సంబంధించిన విష‌యాన్ని కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ త‌న ట్విట్ట‌ర్‌లో ట్యాగ్ చేశారు.

ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత సోలార్ విద్యుత్

కరెంటు కష్టాలు లేని దేశం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం కట్టిబడి ఉందని తెలిపారు. దేశంలో కోటీ ఇండ్లపై రూఫ్ ఆఫ్ సోలార్ సెట్ అప్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి ఇంటికి 300 యూనిట్ల సోలార్ విద్యుత్ ఉచితంగా అందిస్తామని బడ్జెట్లో ప్రకటన చేశారు నిర్మల సీతారామన్. దీంతో ప్రతి కుటుంబానికి ఏటా 15 వేల నుంచి 18 వేల రూపాయలు ఆదా అవుతుందని వివరించారు. వినియోగం పొగ మిగిలిన విద్యుత్తును పంపిణీ సంస్థలకు విక్రయించవచ్చని తెలిపారు.
 
ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం
 
ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రజా రవాణా సేవల్లోకి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడంతో పాటు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెంచడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
 
 ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నామన్న ఆమె తద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను సైతం పెంచేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ నిర్ణయంతో నిర్వహణ, ఉత్పత్తి, సంస్థాపన తదితర రంగాల్లో ఉద్యోగాలకు డిమాండ్‌ పెరుగుతుందని వివరించారు.