అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతున్నా ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలు విషయమై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతూ వస్తున్నది. మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణం మినహా మరే హామీ అమలుకు నోచుకోవడం లేదు. ఎంతో ఆడంబరంగా `ప్రజాపాలన’ అంటూ ఈ పధకాల కోసం దరఖాస్తులు స్వీకరించారు.
ఐదు గ్యారంటీలకు ప్రభుత్వానికి 1,09,01,255 వచ్చాయని ప్రకటించారు. అయితే ఈ పధకాల అమలుకు రేషన్ కార్డులు ఉండటం తప్పనిసరని ఒక వంక ప్రభుత్వం చెబుతున్నది. మరోవంక కొత్త రేషన్ కార్డుల జారీ విషయమై నిర్దిష్టంగా ప్రకటన చేయడం లేదు. ముందుగా అనర్హుల పేర్లను తొలగించడం ద్వారా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించి ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం దరఖాస్తుల్లో 2.82 లక్షల డూప్లికేట్ దరఖాస్తులు గుర్తించినట్లు వెల్లడించారు. రేషన్ కార్డులు, ఆధార్ నెంబర్లు లేకుండా కొన్ని దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. దరఖాస్తుల్లో కొందరు నంబర్లు తప్పుగా రాసినట్లు అధికారులు పేర్కొన్నారు. అసలైన అర్హులు నష్టపోకుండా వాటిని మరోసారి పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారును ఆదేశించారు.
మరోవంక, ప్రస్తుతం రేషన్ కార్డుల ఈకేవైసీ ప్రక్రియ కొనసాగుతోది. ఈ నెలాఖారు వరకు ఈ ప్రక్రియ జరగనుంది. ఇందులో అప్డేట్ చేసుకోనివారిని పక్కనపెట్టాలని యోచిస్తోంది ప్రభుత్వం. ఈకేవైసీ పూర్తి అయితే అసలైన అర్హుల జాబితా వివరాలు అందుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. చాలా మంది ఆసక్తి చూపకపోతుండగా ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది ఈకేవైసీ ప్రక్రియ పూర్తయితే చాలా బోగస్కార్డులు బయటికి వస్తాయని లెక్కలు వేస్తోంది ప్రభుత్వం. ఆ వెంటనే కొత్త రేషన్ కార్జుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వెరిఫికేషన్ చేయాలని భావిస్తోంది. ఆ తర్వాతనే కొత్త కార్డులను మంజూరు చేయాలని చూస్తోంది.
మార్చి మాసంలో అర్హులైన వారిని గుర్తించి కొత్త రేషన్కార్డుల జారీని ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రజాపాలన కార్యక్రమంలో చాలా మంది కొత్త రేషన్ కార్డు కోసం తెల్ల కాగితంపై రాసి దరఖాస్తు పెట్టుకున్నారు. ఇక దరఖాస్తు చేసుకొనివాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రేషన్ కార్డుల మంజూరు విషయంలో ఒక విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది సర్కార్.
కొత్త కార్డుల మంజూరులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించే ఆలోచనలో ఉంది. ఫిబ్రవరి మాసంలో మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

More Stories
మెట్రో ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణలు
ఎసిబి సోదాల్లో సర్వే డిప్యూటీ డైరెక్టర్‌కు రూ.200 కోట్ల ఆస్తుల
ఎంఐఎం, లవ్ జిహాద్, అఘాయిత్యాలపై ఎందుకీ చోద్యం?