జ్ఞాన‌వాపీ మ‌సీదులో శివ‌పూజ‌లు

జ్ఞానవాపి మసీదు బేస్‌మెంట్‌లోని వ్యాస్‌ టిఖానా వద్ద ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు గురువారం పూజలు చేశారు. ఆ పూజ‌ల‌కు చెందిన వీడియో ఒక‌టి రిలీజైంది. మ‌సీదులో పూజ‌లు చేసుకోవ‌చ్చు అని బుధవారం జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసిన విష‌యం తెలిసిందే.
 
వారంలోగా పూజలు చేసుకొనేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని న్యాయమూర్తి ఏకే విశ్వాస్ బుధ‌వారం ఆదేశించగా అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఆ ఆదేశాల ప్ర‌కార‌మే ఇవాళ పూజ‌లు చేప‌ట్టారు. ఓ పూజారి హార‌తి ఇస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ దృశ్యాలు వాస్త‌వ‌మే అని న్యాయ‌వాది విష్ణు శంక‌ర్ జైన్ తెలిపారు. 
 
జ్ఞాన‌వాపి కేసులో ఆయ‌న హిందువుల త‌ర‌పున న్యాయ పోరాటం చేశారు.  “వారణాసి కోర్టు ఆదేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం బారికేడింగ్‌కు సవరణలు చేసింది. ‘వ్యాస్ పరివార్ తెహ్ఖానా’లో రోజువారీ పూజ ప్రారంభమైంది” అని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 10.30 గంటలకు సెల్లార్ తెరిచి పూజలు నిర్వహించినట్లు కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ చైర్మన్ నాగేంద్ర పాండే తెలిపారు.
హిందూ తరపు న్యాయవాది మదన్ మోహన్ యాదవ్ ప్రకారం, మసీదు లోని ‘వజుఖానా’కు ఎదురుగా ఉన్న నంది విగ్రహం ముందు ఉన్న బారికేడ్లు తొలగించారు.  బుధవారం రాత్రి 9.30 గంటలకు కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ సభ్యులను పిలిచి మసీదు ‘వజుఖానా’కు ఎదురుగా ఉన్న నంది విగ్రహం ముందు ఉన్న బారికేడ్లను తొలగించినట్లు జిల్లా పాలనా యంత్రాంగంలోని అధికారిక వర్గాలు తెలిపాయి.
 
జ్ఞాన్‌వాపి మసీదులో ప్రార్థనలు చేయడానికి అనుమతించబడిన వ్యాస్ కుటుంబ సభ్యుడు జితేంద్ర నాథ్ వ్యాస్ మాట్లాడుతూ, “అక్కడ పూజను పునఃప్రారంభించడానికి మాకు అనుమతి లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నిన్న పూజ సమయంలో, ఐదుగురు పూజారులు కాశీ విశ్వనాథ్ ఆలయ ట్రస్ట్, వ్యాస్ కుటుంబ సభ్యులు, వారణాసి డిఎం, కమిషనర్ పాల్గొన్నారు” అని చెప్పారు.
 
ఇదిలావుండగా, మసీదు సీలు చేసిన ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతిస్తూ వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. అయితే, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సహించింది.  
 
జిల్లా కోర్టు ఆదేశాలను అనుసరించి, మసీదు కమిటీ బుధవారం రాత్రి సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించింది. సైట్‌లో యథాతథ స్థితిని కొనసాగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణను కోరింది. బుధవారం రాత్రే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని, మసీదు కమిటీ ఎలాంటి న్యాయపరమైన సవాలును ఎదుర్కొనకుండా నివారించాలని కోరింది. అయినా ఫలితం లేకపోయింది.