నెంబర్ వన్ బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి నెంబర్ వన్ స్థానాన్ని అధిరోహించాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అశ్విన్ 853 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉండగా.. భారత్ నుంచి మరో ఇద్దరు బౌలర్లు కూడా టాప్ 10 లో చోటు సంపాదించారు. జస్ ప్రీత్ బుమ్రా 825 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 754 పాయింట్లతో ఓలీ రాబిన్ సన్ తో సంయుక్తంగా ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇంగ్లండ్ తో ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీయగా.. బుమ్రా కూడా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక జడేజా ఐదు వికెట్లతో రాణించాడు. అయితే రెండో టెస్టుకు జడేజా దూరం కావడంతో ర్యాంకింగ్స్ లో పడిపోయే అవకాశముంది. కగిసో రబాడ, పాట్ కమిన్స్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఇక బ్యాటింగ్ విభాగంలో భారత్ నుంచి విరాట్ కోహ్లి మినహా ఎవరు టాప్ 10లో చోటు దక్కించుకోలేదు. తొలి రెండు టెస్టులకు కోహ్లి దూరంగా ఉన్నప్పటికి 767 పాయింట్లతో కోహ్లి ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.

తొలి స్థానంలో కేన్ విలియమ్సన్(864 పాయింట్లు), జో రూట్( 832 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. స్టీవ్ స్మిత్ 818 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండ్ విభాగంలో భారత్ నుంచి రవీంద్ర జడేజా 425 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. 328 పాయింట్లతో అశ్విన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. భారత్ తో జరిగిన తొలి టెస్టులో బౌలింగ్ తో మెరిసిన జో రూట్ 313 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండడం విశేషం. ఇక మరో భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ 290 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.