విపత్తుల ఫలితంగా భారత్ లో 5 లక్షల మంది నిరాశ్రయం

భారత్‌లో 2023లో వరదలు, తుపానులు, భూకంపాలు, ఇతర విపత్తుల కారణంగా ఐదు లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని మంగళవారం విడుదలైన ఒక ప్రపంచ నివేదిక వెల్లడించింది. 2022లోని సంఖ్య కన్నా ఇది బాగా తక్కువ. ఆ ఏడాది సుమారు 25 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. నిరుడు హిమాలయ ప్రాంత రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ప్రాణాంతక వరదలు అపార విధ్వంసం సృష్టించాయి. 

నిరుడు అక్టోబర్‌లో సిక్కింలో హిమానీ సరస్సు వరదలకు కారణం కాగా జలవిద్యుత్ డ్యామ్ కూలిపోయి 100 మందికి పైగా దుర్మరణం చెందారు. మరి 80 వేల మందికి పైగా బాధితులయ్యారు. ‘అత్యంత వరద బాధిత కేంద్రం’గా గుర్తించిన ఢిల్లీలో 2023 జూలై 9న భారీ వర్షాల అనంతరం యమునా నది పొంగి ప్రవహించడంతో అధికారులు ప్రజలను ఇళ్లలో నుంచి ఖాళీ చేయించవలసి వచ్చింది. 

జెనీవా కేంద్రంగా గల అంతర్గత నిరాశ్రయ పర్యవేక్షణ కేంద్రం (ఐడిఎంసి) నివేదిక ప్రకారం, దేశ రాజధానిలో సుమారు 27 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. జూలై 9న కేవలం 24 గంటల్లో ఢిల్లీలో 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోడైంది.1982 జూలై 25 తరువాత ఢిల్లీలో ఒక్క రోజులో అత్యధిక వర్షపాతం నమోదైంది. 

మొత్తంగా దక్షిణాసియాలో 2023లో అంతర్గతంగా సుమారు 37 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. విపత్తుల వల్ల నిరాశ్రయులు అయినవారి సంఖ్య 36 లక్షలు, 2018 తరువాత అదే కనిష్ఠ సంఖ్య. విపత్తుల వల్ల నిరాశ్రయుల సంఖ్య పతనానికి ఎల్ నినో ప్రభావం కొంత వరకు కారణం అని పరిశోధకులు సూచించారు. 

ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాకాలంలో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైందని, బలహీన తుపాను సీజన్ మరొక కారణమని వారు పేర్కొన్నారు. అయితే, వరదలు, తుపానులు తరచు అవే ప్రాంతాల్లో సంభవించి ప్రజలను నిరాశ్రయులను చేస్తూనే ఉన్నాయి. విపత్తుల వల్ల జనం నిరాశ్రయులు కాకుండా ఏ దేశమూ తప్పించుకోజాదని ఐడిఎంసి డైరెక్టర్ అలెగ్జాండ్రా బిలాక్ పేర్కొన్నారు.