సీబీఎస్ఈలో కొనసాగిన బాలికల హవా

సీబీఎస్ఈ 10వ తరగతిలో 93.60 శాతం, 12వ తరగతిలో 87.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఈ ఫలితాలను సీబీఎ్‌సఈ సోమవారం విడుదల చేసింది. 10, 12లో ఉత్తీర్ణత గత ఏడాది కంటే స్వల్పంగా పెరగ్గా, ఈ ఏడాది కూడా బాలికల హవా కొనసాగింది. 90, 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా పెరిగింది. 10వ తరగతిలో 2.12 లక్షల మంది 90 శాతం కంటే, 47 వేల మంది 95 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించారు.

12వ తరగతిలో 1.16 లక్షల మందికి 90 శాతం కంటే, 24,068 మందికి 95 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. వీరిలో 305 మంది ప్రత్యేక అవసరాలు కలిగిన (సీఎ్‌సడబ్ల్యూఎన్‌ క్యాటగిరీ) విద్యార్థులు ఉన్నారు.  ‘అనారోగ్యకర పోటీ’ని నివారించడానికి మెరిట్‌ జాబితా ప్రచురించకూడదని, ప్రథమ, ద్వితీయ, తృతీయ డివిజన్లు కూడా కేటాయించకూడదని సీబీఎస్ఈ నిర్ణయించింది. అయితే వివిధ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు అందించనుంది.

అత్యధికంగా 10లో గణితంలో 11,253 మంది, 12లో పెయింటింగ్‌లో 10,402 మంది నూటికి నూరు మార్కులు సాధించారు. ఈ సబ్జెక్టుల తర్వాత సంస్కృతం, కృత్రిమ మేధ (ఏఐ), రసాయన శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా 2 వేల నుంచి 7 వేల మందికి పూర్తి మార్కులు లభించాయి. తిరువనంతపురం రీజియన్‌ అత్యధిక ఉత్తీర్ణత (10లో 99.91 శాతం, 12లో 99.75 శాతం) సాధించింది.

10లో గువాహటి రీజియన్‌ (77.94 శాతం), 12లో ప్రయాగ్‌రాజ్‌ రీజియన్‌ (78.25 శాతం) అతి తక్కవ ఉత్తీర్ణత సాధించాయి. జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 99.09 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జూలై 15 నుంచి 10, 12 తరగతుల సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.  10లో రెండు సబ్జెక్టులు, 12లో ఒక సబ్జెక్టు మిగిలిపోయిన విద్యార్థులు సప్లిమెంటరీ రాయవచ్చు. ఈ క్యాటగిరీలోకి వచ్చేవారు 10లో 1.32 లక్షల మంది, 12లో 1.22 లక్షల మంది ఉన్నారు. 10లో రెండు సబ్జెక్టుల్లో, 12లో ఒక సబ్జెక్టులో మార్కులు పెంచుకోవాలనుకునే విద్యార్థులు కూడా సప్లిమెంటరీకి అర్హులు.