ఛత్తీస్‌గఢ్‌లో 8, మహారాష్ట్రాలో ముగ్గురు మావోల హతం

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రాలలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్ లలో సోమవారం 11 మంది మావోయిస్టులు మృతి చెందారు.  ఛత్తీస్‌గఢ్‌లో సెమ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్‌లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది.  సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న సమచారంతో భద్రతాదళాలు అక్కడికి వెళ్లి, స్థానిక పోలీసులతో కలిసి కూంబింగ్‌ నిర్వహించాయి.
ఈ సందర్భంగా మావోయిస్టులు తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగాయి. భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు.  ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా ప్రాంతంలో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

మరోవంక, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో సోమవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు మహిళలతోసహా ముగ్గురు నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు. భమ్రాగడ్ తాలూకాలోని కట్రంగట్ట గ్రామ సమీపంలోని అడవిలో నక్సలైట్లు మకాం పెట్టారని నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు అక్కడకు చేరుకున్నాయని జిల్లా ఎస్‌పి నీలోత్పల్ తెలిపారు. 

గడ్చిరోలి పోలీసులకు చెందిన సి 60 కమాండోలకు చెందిన రెండు యూనిట్లు వెంటనే ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టాయని ఆయన చెప్పారు. నక్సలైట్లు కాల్పులు ప్రారంభించడంతో సి 60 సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారని యన చెప్పారు. కాల్పులు ఆగిన అంతరం ఆ ప్రాంతంలో గాలింపు జరపగా ఇద్దరు మహిళా నక్సలైట్లతోసహా మూడు మృతదేహాలు లభించాయని ఆయన తెలిపారు. 

వారిలో ఒకరిని పెరిమిలి దళం కమాండర్, ఇన్‌చార్జ్ వాసుగా గుర్తించినట్లు ఎస్‌పి చెప్పారు. ఒక ఎకె 47 రైఫిల్, ఒక కార్బైన్, ఒక ఎన్సాస్ రైఫిల్, నక్సల్ సాహిత్యం, కొన్ని వస్తువులను ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఆ ప్రాంతంలో నక్సల్స్ కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు.