ముంబైలో కూలిన భారీ హోర్డింగ్.. 14 మంది మృతి

మహారాష్ట్ర ముంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల దాటికి ఘాట్కోపర్‌ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో శిథిలాలను తొలగించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
 
సోమవారం సాయంత్రం దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్కోపర్‌, ములుంద్‌, విఖ్రోలితోపాటు దక్షిణ ముంబయిలో అనేక ప్రాంతాల్లో వర్షంతోపాటు, బలమైన గాలులు వీచాయి. చెడ్డా నగర్‌ జింఖానా ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్‌ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. సుమారు 100 మందికిపైగా దాని కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. అంబులెన్సులు, భారీ క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో సహాయకు చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబయి అధికారులు తెలిపారు. కూలిపోయిన హోర్డింగ్ కింద మరో 20-30 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని బీఎంసీ కమిషనర్ భూషణ్ గగ్రానీ తెలిపారు.

అంతకుముందుకు ఘటనాస్థలికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే చేరుకున్నారు. ప్రజలను రక్షించడమే తమ ప్రాధాన్యమని తెలిపారు. ఘటనలో గాయపడిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన చికిత్స అందిస్తుందని చెప్పారు. మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నగరంలోని ఇలాంటి హోర్డింగ్‌లన్నింటినీ సమీక్ష చేయమని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

 ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా ఘటనాస్థలిని పరిశీలించారు. “ఈ హోర్డింగ్‌కు అనుమతి ఉందా లేదా అనే దానిపై విచారణ జరుగుతోంది. ముంబయిలోని అన్ని హోర్డింగ్‌లను సరైన ఆడిట్ చేయాలని సీఎం ఆదేశించారు. నగరంలో ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ కేసులో నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని ఆయన స్పష్టం చేశారు.  ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

గాలి దుమారం తీవ్రతతో పాటు దృశ్య నాణ్యత పడిపోవడం వల్ల ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గంటపాటు కార్యకలాపాలు నిలిచిపోయాయి. 15 విమానాలను దారిమళ్లించారు. సాయంత్రం 5 గంటల తర్వాత విమాన సేవలను పునరుద్దరించారు. అకస్మాత్తుగా గాలులతో కూడిన వర్షం కురవడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయి. లోకల్ రైళ్లు కూడా ఆలస్యంగా నడిచాయి.