ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న మంటలను నియంత్రించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. అటవీ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే నిధులు కేటాయించని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడింది.
గత ఏడాది నవంబర్ నుంచి ఉత్తరాఖండ్ అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. మంటలు విస్తరిస్తుండటంతో 1,437 హెక్టార్లకుపైగా పచ్చని చెట్లు కాలిపోయాయి. అటవీ ప్రాంతం దగ్ధంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. ఉత్తరాఖండ్ అడవుల్లో చెలరేగిన మంటలను నియంత్రించకపోవడంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. 40 శాతంపైగా అడవులు అగ్నికి ఆహుతైనట్లు న్యాయవాది పరమేశ్వర్ కోర్టుకు తెలిపారు. మంటలను నియంత్రించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మరోవైపు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తరుఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా అడవుల్లో కొత్తగా మంటలు లేవని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన నిధులు అందలేదని చెప్పారు.
మంటల నియంత్రణకు 9,000 మందికిపైగా పని చేస్తున్నారని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రానికి చెందిన ఆరుగురు సభ్యుల కమిటీ పర్యవేక్షిస్తున్నదని, 420 కేసులు నమోదయ్యాయని వివరించారు. కాగా, అడవుల్లో మంటల నియంత్రణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూ. 10 కోట్లు డిమాండ్ చేయగా కేంద్రం రూ.3.15 కోట్లు కేటాయించడంపై సుప్రీంకోర్టు కోర్టు మండిపడింది.
అలాగే అటవీ శాఖ సిబ్బందిని ఎన్నికల విధుల్లో నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల నిర్లక్ష్యం, బాధ్యతా రహిత్యంపై సర్వోన్నత న్యాయస్థానం నిప్పులు చెరిగింది.
More Stories
బయటపడిన మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్
99.1 కోట్లకు చేరిన భారత ఓటర్ల సంఖ్య
మహారాష్ట్రలో పుష్పక్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంలో 12 మంది మృతి