
చార్ ధామ్ యాత్ర ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలైన గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్ ఆలయాలను సందర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. దీంతో అక్కడ తీవ్రమైన రద్దీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే యాత్రకు వచ్చే భక్తులు ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
‘గంగోత్రి, యమునోత్రికి వచ్చే భక్తులందరూ తీర్థయాత్ర కోసం ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే, రిజిస్ట్రేషన్ తేదీకి ముందు మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవద్దని కోరుతున్నాము’ అని సీనియర్ పోలీసు అధికారి అర్పన్ యదువంశీ తెలిపారు.
మరోవైపు రిజిస్ట్రేషన్ లేని భక్తులను తీర్థయాత్రకు అనుమతించబోమని ఉత్తరాఖండ్ ప్రధాన కార్యదర్శి రాధా రాటూరి స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు లేఖ పంపుతున్నట్లు తెలిపారు. యాత్ర మార్గంలో పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ లేకుండా వచ్చే వాహనాలను లోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు.
పవిత్ర స్థలాలకు 200 మీటర్ల దూరం వరకూ మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని చెప్పారు. యాత్రకు సంబంధించిన తప్పుదోవ పట్టించే వీడియోలు, రీల్స్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. చార్‌ధామ్ యాత్రలో భాగంగా తొలిరోజున యమునోత్రికి దాదాపు 45 వేల మంది దర్శనానికి రావడంతో ఇరుకైన దారిలో నడిచేందుకు కూడా భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ప్రస్తుతం గంగోత్రి యాత్ర రూట్‌లో పెద్దయెత్తున ట్రాఫిక్ ఉంటున్నది. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు అధికారులు టూరిస్టు వాహనాలను పలుచోట్ల నిలిపివేస్తున్నారు. అయితే ఇది గంగోత్రి, యమునోత్రి హైవేలపై మరింత ట్రాఫిక్‌కు దారితీసింది. 15- 20 వేల మంది భక్తులు కొన్ని గంటలపాటు తమ వాహనాల్లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
దీంతో చాలా మంది భక్తులు తమ చార్‌ధామ్ యాత్రను మధ్యలోనే ముగించుకొని తిరిగి వెనక్కు వెళ్లిపోతున్నారు. హైవేపై పలు పాయింట్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో గంగోత్రి చేరుకొనేందుకు 16-20 గంటల సమయం పడుతుందని కొంత మంది భక్తులు పేర్కొన్నారు. యమునోత్రి హైవేపై కూడా ఇదే పరిస్థితి ఉన్నదని చెప్పారు.
More Stories
కుంభమేళాలో పాల్గొన్న పాక్ హిందువులు
జమ్ముకశ్మీర్‌లో 12 మంది పాక్ చొరబాటుదారులు కాల్చివేత
ఢిల్లీలో బిజెపి సునామి.. యాక్సిస్ మై ఇండియా అంచనా