భారత్ లో కొత్తగా 14 ల‌క్షల‌ క్యాన్స‌ర్ కేసులు

భార‌త్‌లో 2022లో కొత్త‌గా 14.1 ల‌క్ష‌ల క్యాన్స‌ర్ కేసులు న‌మోదు అయ్యాయి. ఆ ఏడాది సుమారు 9.1 ల‌క్ష‌ల మంది ఆ వ్యాధి వ‌ల్ల మ‌ర‌ణించారు. ఎక్కువ శాతం భారతీయుల్లో రొమ్ము క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది. పెద‌వు, నోరు, ఊపిరితిత్తులు క్యాన్స‌ర్ కేసులు ఎక్కువ శాతం పురుషుల్లో ఉన్నాయి. 
 
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)కు చెందిన క్యాన్సర్‌ విభాగం ‘ఇంటర్నేషనల్‌ ఏజెన్సీ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (ఐఏఆర్‌సీ) వెల్లడించింది. పురుషుల్లో నోటి (లిప్‌, ఓరల్‌ క్యావిటీ) క్యాన్సర్‌ (మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో 15.3%), ఊపిరితిత్తుల క్యాన్సర్‌ (8.5%).. మహిళల్లో రొమ్ము (27%), గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కేసులు (18%) ఎక్కువగా నమోదవుతున్నట్టు పేర్కొంది. 
 
భారతదేశంలో 75 ఏళ్లలోపు వారు క్యాన్సర్‌ బారిన పడే ముప్పు 10.6 శాతం, ఆ మహమ్మారి కారణంగా మరణించే ముప్పు 7.2 శాతంగా ఉందని, అంతర్జాతీయంగా ఈ రెండింటి సగటు వరుసగా 20 శాతం, 9.6 శాతం ఉన్నాయని ఐఏఆర్‌సీ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 2కోట్ల క్యాన్సర్‌ కేసులు, 97 లక్షల మరణాలు నమోదు అవుతున్నాయని వెల్లడించింది

115 దేశాల‌కు చెందిన క్యాన్స‌ర్ రిపోర్టును డ‌బ్ల్యూహెచ్‌వో రిలీజ్ చేసింది. కేవ‌లం 39 శాతం దేశాలు మాత్ర‌మే క్యాన్స‌ర్ చికిత్స గురించి అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ట్లు ఆ రిపోర్టులో వెల్ల‌డించారు.  మహిళల్లో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో రెండో స్థానంలో రొమ్ము క్యాన్సర్‌ (11.6 శాతం) ఉన్నప్పటికీ, దానివల్ల మరణాల ముప్పు (7 శాతమే) తక్కువగా ఉందని వివరించింది. 

అలాగే ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎక్కువగా నమోదవుతున్న క్యాన్సర్లలో ఎనిమిదో స్థానంలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ ఉందని,  క్యాన్సర్‌ మరణాల్లో 9వ స్థానంలో ఉందని వెల్లడించింది. 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏటా 3.5 కోట్ల క్యాన్సర్‌ కేసులు నమోదు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. క్యాన్సర్‌ కేసుల పెరుగుదల సామాజిక ఆర్థికాభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సర్వైకల్‌ క్యాన్సర్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. సర్వైకల్‌ క్యాన్సర్‌ ఎలిమినేషన్‌ ఇనిషియేటివ్‌ ప్రొగ్రామ్‌ ద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించవచ్చని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది. కాగా. మనదేశంలో 2023 సంవత్సరంలో 3.4 లక్షలకు పైగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కేసులు నమోదైనట్టు భారత వైద్య పరిశోధన మండలికి చెందిన జాతీయ క్యాన్సర్‌ రిజిస్ట్రీ ప్రోగ్రామ్‌ తెలిపింది.

ఈ విషయాన్ని కేంద్రం శుక్రవారం లోక్‌సభలో వెల్లడించింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సాంకేతిక ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్టు కేంద్రమంత్రి సత్యపాల్‌ సింగ్‌ తెలిపారు.