వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో టీమ్‌ఇండియా

ఐసిసి తాజాగా విడుదల చేసిన వార్షిక ర్యాంకుల్లో టీమ్‌ఇండియాకు వన్డేలు, టీ20లో అగ్రస్థానంలో నిలిచింది. టెస్టుల్లో ఆసీస్‌ నంబర్‌ వన్‌గా ఉండగా భారత్‌ రెండో స్థానానికి పడిపోయింది. వన్డేల్లో భారత్‌ 122 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆసీస్‌ (116), దక్షిణాఫ్రికా (112), పాకిస్థాన్‌ (106), న్యూజిలాండ్‌ (101) టాప్‌ -5లో ఉన్నాయి. 
 
టీ20ల్లో 264 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా (257) ఒక స్థానాన్ని మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్‌లోకి వచ్చింది. ఇంగ్లాండ్‌ (252), దక్షిణాఫ్రికా (250), న్యూజిలాండ్‌ (250), వెస్టిండీస్‌ (249) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్‌ రెండు ప్లేస్‌లను కోల్పోయి ఏడుకి పడిపోయింది.
సూర్య టాప్‌
ఐసీసీ వ్యక్తిగత టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (861) టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. ఫిల్‌ సాల్ట్‌ (802), రిజ్వాన్‌ (784), బాబర్‌ అజామ్‌ (763), ఐదెన్‌ మార్‌క్రమ్‌ (755) టాప్‌-5లో ఉన్నారు.
టెస్టుల్లో ఆసీస్‌
టెస్టుల్లో మాత్రం ఆసీస్‌ (124 పాయింట్లు)తో ముందుకొచ్చేసింది. భారత్‌ (120), ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా (103), న్యూజిలాండ్‌ (93) ఆ తర్వాత స్థానాల్లో నిలిచాయి. 
 
కాగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ పట్టికలో భారత్‌ అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం టీమ్‌ఇండియా 68.51 శాతం, ఆసీస్‌ 62.50 శాతంతో తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి మొదటి రెండు ర్యాంకుల్లో నిలిచిన జట్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తలపడతాయి.