జ్ఞానవాపీ మసీదు కమిటీకి హైకోర్టులో చుక్కెదురు

వారణాసిలోని జ్ఞాన్‌వాపీ మసీదును నిర్వహిస్తున్న అంజుమన్‌ ఇంతెజామియా మసీద్‌ కమిటీకి శుక్రవారం అలహాబాద్‌ హైకోర్టులో ఎలాంటి తక్షణ ఊరట లభించలేదు. మసీదు దక్షిణ సెల్లారులోని వేద వ్యాస్‌ పీఠ్‌లో ఉన్న హిందూ దేవత విగ్రహాలకు పూజారి పూజలు జరుపుకోవచ్చంటూ బుధవారం వారాణసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది. 

ఈ అప్పీలును పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ రోహిత్‌ రంజన్‌ అగర్వాల్‌ ఎలాంటి తక్షణ ఉత్తర్వులు ఇవ్వడానికి సుముఖత తెలుపలేదు. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు. జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ గురువారం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ముందుగా హైకోర్టులో పిటిషన్‌ వేయాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి చెప్పడంతో కొద్ది గంటల వ్యవధిలోనే అలహాబాద్‌ హైకోర్టులో అప్పీలు సమర్పించింది.

మసీదు కమిటీ తరఫున న్యాయవాది ఎస్‌.ఎ్‌ఫ.ఎ. నక్వీ వాదనలు వినిపిస్తూ జిల్లా జడ్జి అజయ్‌ కృష్ణ విశ్వేశ రిటైరైన రోజునే చాలా హడావుడిగా  తీర్పు ఇచ్చారని తెలిపారు.  జనవరి 31 (బుధవారం)న ఆయన పదవీ విరమణ చేశారని, అదే రోజున ఆయన నిర్ణయాన్ని వెలువరించారని తెలిపారు. తాము సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు.

హిందూ పక్షం తరఫున విష్ణు శంకర్‌ జైన్‌ వాదిస్తూ నిజానికి ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి జిల్లా కలెక్టర్‌ను రిసీవర్‌గా నియమిస్తూ జనవరి 17నే జిల్లా కోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు.  ఆ మేరకు ఆయన జనవరి 24న దానిని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. జనవరి 17వ తేదీ ఉత్తర్వులకు కొనసాగింపుగా, తదుపరి చర్యగానే జనవరి 31న ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. అదేమీ కొత్త ఉత్తర్వు కాదని చెప్పారు. జనవరి 17న ఇచ్చిన ఆదేశాలకు అభ్యంతరం చెప్పనందున ప్రస్తుతం చేసిన అప్పీలుకు విచారణార్హత లేదని తెలిపారు.

మరోవంక, శుక్రవారం కావడంతో జ్ఞాన్‌వాపీ మసీదు వద్ద నమాజ్‌ చేయడానికి పెద్ద సంఖ్యలో ముస్లింలు హాజరయ్యారు. కోర్టు తీర్పు నేపథ్యంలో గతంలోకన్నా రెట్టింపు సంఖ్యలో వచ్చారు. దాంతో ఇతర మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేయాలంటూ పోలీసులు వారిని తిప్పి పంపించారు. 

మరోవైపు మసీదు కమిటీ పిలుపు మేరకు వారాణసిలోని ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతాల్లో బంద్‌ పాటించారు. షాపులను మూసివేయాలని, మహిళలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదని ఆ కమిటీ కోరింది. శాంతి యుతంగా నమాజ్‌ చేయాలని హితవు చెప్పింది. అధికార యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించడంతో అంతా ప్రశాంతంగా సాగింది.