గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి హైకోర్టు బ్రేక్‌

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై రాష్ట్ర హైకోర్టు మంగళవారం కీలక ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం యథాతథ స్థితినే కొనసాగించాలని, తాము తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించవద్దని తన ఆదేశాల్లో పేర్కొన్నది. 

దాంతో హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా ప్రొఫెసర్‌ కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లు ప్రమాణం చేయడానికి వీల్లేకుండా పోయింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ఖాన్‌లను నియమించడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్‌, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు తాజా ఉత్తర్వులు ఇచ్చింది.  తదుపరి విచారణను ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది. 

కాగా, కొద్ది నెలల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, సత్యనారాయణను కేబినెట్ నామినేట్ చేసింది. వీరి పేర్లను గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. అయితే గవర్నర్ తమిళిసై వీరిద్దరికి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసే అర్హతలు లేవని తిరస్కరించారు. 

అనంతరం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల జరగడం, కొత్త ప్రభుత్వం ఏర్పడడం చకచకా జరిగిపోయింది. తమ పేర్లను గవర్నర్ ఆమోదించకపోవడంపై దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టికల్ 171 ప్రకారం తమను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిందని కోర్టుకు తెలిపారు. 

కేబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించే హక్కు గవర్నర్ కు లేదని పేర్కొన్నారు. వీరి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పిటిషన్ పై హైకోర్టు ఏ విషయం తేల్చేవరకూ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఎంపిక ఉండబోదని రాజ్ భవన్ వర్గాలు చెప్పాయి. కానీ ఇంతలో ప్రొ.కోదండరామ్, అమీర్‌ అలీఖాన్‌ పేర్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌ కోటాకు ప్రతిపాదించింది. 

ఈ సిఫార్సుకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. తమ పిటిషన్ పెండింగ్ లో ఉండగా గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను ఆమోదించడంపై దాసోజు శ్రవణ్ , సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ పై తదుపరి విచారణ వరకు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం వద్దని హైకోర్టు ఆదేశించింది.