6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి యూ టర్న్

కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన 6 గ్యారెంటీ హామీలను 100 రోజుల్లో కచ్చితంగా అమలు చేస్తామని ఇంతకాలం ప్రకటిస్తూ వచ్చిన సీఎం రేవంత్ రెడ్ వాటి అమలుకు మెలిక పెట్టారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు అందించాలని.. అలాగే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలని.. అప్పుడే గ్యారెంటీ హామీలు అమలు చేస్తామని విస్పష్టంగా ప్రకటించారు.

గ్యారెంటీ హామీల అమలుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది. 5 లక్షల కోట్లు అని ఒకరు.. 8 లక్షల కోట్లు అని మరొకరు.. తాజాగా సీఎం అయితే.. ఏకంగా రూ.10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పారు. ఈ సమయంలో గ్యారెంటీ హామీల అమలు అంత సులభమేమీ కాదు. కానీ.. ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లో 6 గ్యారెంటీ హామీలు అమలు చేయడంలో వెనక్కు వెళ్లేది లేనే లేదని తరచూ చెప్పుకొస్తూ వస్తోంది. మరి ఇంత అప్పు ఉండగా.. వాటికి వడ్డీతో పాటు.. గ్యారెంటీ హామీలకు నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనే అనుమానం అందరిలో ఉంది. అయితే ఆ అనుమానం నిజమే అని రేవంత్ వ్యాఖ్యలతో తేలిపోయింది.