జడ్చర్లలో రామాలయం ప్రహరీ గోడ ధ్వంసం

మహబూబ్ నగర్ (పాలమూరు) జిల్లా జడ్చర్ల పట్టణంలో రామాలయం పై దాడి జరిగింది. క్రైస్తవ అల్లరి మూక ఒక్కసారిగా రెచ్చిపోయి రామాలయాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నం చేసింది. అది కుదరక రామాలయ ప్రహరీ గోడను కూల్చివేసింది. మంగళవారం రాత్రి ఒకేసారి వందల సంఖ్యలో గుంపులు గుంపులుగా వచ్చి చేరి రామాలయం పై భీకర దాడి చేసింది.
 
 “రాముడి గుడి ఇక్కడ ఉండడానికి వీల్లేదు.. ఇంత స్థలం రాముడి గుడికి అవసరం లేదు..” అంటూ నానా హంగామా చేస్తూ భయానికి వాతావరణం సృష్టించారు. మాకు కొంత భాగం ఇవ్వండి.. లేదంటే రామాలయాన్ని కూల్చేసి, చర్చి నిర్మిస్తాము”అని  హెచ్చరికలు జారీ చేశారు. భయానక రీతిలో నినాదాలు చేశారు
 
రాజకీయాలకు అతీతంగా హిందువులంతా ఒక్కటే సంఘటితంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని, రామాలయ స్థలాన్ని కాపాడుకుని రామాలయ పవిత్రతను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్వహిందూ పరిషత్  రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాధులు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 
 
ఈ ఘటనకు బాధ్యులైన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాడికి పాల్పడిన వాళ్లపై కమ్యూనల్ చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని పోలీసులను డిమాండ్ చేశారు. గురువారం జడ్చర్ల నగరంలోని ధ్వంసమైన రామాలయాన్ని సందర్శించేందుకు పరిషత్ రాష్ట్ర బృందం జడ్చర్లకు వస్తుందని రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి తెలిపారు. 
 
దుండగులను కఠినంగా శిక్షించాలని, లేనిపక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రామాలయం జోలికి వస్తే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని,  సీతారామాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన అంగుళం భూమి కూడా వదులుకోమని తేల్చి చెప్పారు. కూల్చివేసిన ప్రహరీ గోడలు పూర్తిస్థాయిలో నిర్మించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అందుకు ఖర్చు కూడా అల్లరి మూకల నుంచే రాబట్టాలని వారు డిమాండ్ చేశారు. .

జడ్చర్ల పట్టణంలోని శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో దాదాపు 17 సంవత్సరాల క్రితం 2008లో సీతారామాంజనేయ స్వామి దేవాలయం నిర్మించారు. ప్రస్తుతం దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధి పనులు, నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇంతలో రెచ్చిపోయిన అల్లరి మూఖలు దేవాలయంపై దాడికి దిగాయి.