ఎబివిపి నేత ఝాన్సీ జుట్టు లాగిన ఘటన కానిస్టేబుల్ సస్పెండ్

రాజేంద్రనగర్ అగ్నికల్చర్ యూనివర్శిటీ భూముల వ్యవహారం ఏబీవీపీ ఆందోళనకు దిగిన సమయంలో నిరసన తెలిపేందుకు వచ్చిన ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు. 
 
రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 55 జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని ఇటీవల రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
 ఈ క్రమంలో పోలీసుల నుంచి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి పారిపోయేందుకు ఆమె పరుగులు తీసింది.
అయితే ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై వెళ్లారు. వారిలో ఓ మహిళా కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించింది.
 
స్కూటీ వెనకాల కూర్చొన్న ఆమె ఝాన్సీ జట్టు పట్టుకొని లాగింది. దీంతో ఝాన్సీ కింద పడిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి.సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాత్ మహంతి వెంటనే స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించారు. విచారణలో మహిళా కానిస్టేబుల్ తప్పు ఉందని తేలడంతో అయేషాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.