తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ రద్దు

తిరుపతిలో హీరో ధనుష్ సినిమా షూటింగ్ కు సంబంధించి బుధవారం నాటికి  ఇచ్చిన  అనుమతిని  తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి రద్దు చేశారు. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసినట్లు తెలిపారు. కాగా, అంతకు ముందు గోవింద రాజస్వామి ఆలయం వద్ద షూటింగ్ చేసి తీరుతామని చిత్ర యూనిట్ ప్రకటించింది. షూటింగ్ చేస్తే అడ్డుకుంటామని, భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని బీజేపీ హెచ్చరించింది. 
 
ఈ వివాదం పెద్దది కావడంతో రేపటి సినిమా షూటింగ్ కు పోలీసులు అనుమతి రద్దు చేశారు.  ఇదిలా ఉంటే ఉదయం అలిపిరి గరుడ సర్కిల్ వద్ద చిత్ర యూనిట్ షూటింగ్ మంగళవారం నిర్వహించింది. అలిపిరి రోడ్డులో నగర ప్రధాన వీధుల్లో సినిమా షూటింగ్ చేశారు. దీంతో భక్తులు, విద్యార్థులు, అంబులెన్స్ లు, నగర ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. 
 
అంతేకాకుండా.. షూటింగ్ పేరుతో గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రశ్నించిన వారిపై బౌన్సర్లతో దాడి చేశారని భక్తులు ఆరోపించారు. ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా వారిపై కూడా దాడికి దిగారు. ఈ క్రమంలో తిరుపతి ప్రధాన రోడ్లపై సినిమా షూటింగ్ లకు అనుమతి ఇవ్వవద్దని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
టెంపుల్ సిటీలో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చిన వారిపై ఈస్ట్ పోలీసులకు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఆధ్మాత్యిక క్షేత్రం, అది తిరుమలకు వెళ్ళే రోడ్డులో ఎలా షూటింగ్ అనుమతి ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే షూటింగ్ అనుమతి రద్దు చేయాలని బీజేపీ డిమాండ్ చేయగా, తాజాగా సినిమా షూటింగ్ కు సంబంధించి బుధవారం నాటి  అనుమతిని రద్దు చేశారు.
 
ధనుష్, నాగార్జునతో శేఖర్ కమ్ముల దర్శ‌క‌త్వంలో ఓ చిత్రం ప్రారంభ‌మైంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తిరుపతిలోని అలిపిరి దగ్గర ధనుష్ తో షూటింగ్ ప్రారంభం కావడంతో ఈ వివాదం చెలరేగింది. ధనుష్‌- శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్న‌ట్లు స‌మాచారం. 
 
తిరుమల కొండపైకి వాహనాల్లో వెళ్లాలంటే అలిపిరి మీదుగానే ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్ర‌దేశమంతా ఎల్ల‌ప్పుడూ భ‌క్తులతో ర‌ద్దీగానే ఉంటుంది. ఇలాంటి ప్ర‌దేశంలో షూటింగ్ కోసం చిత్ర యూనిట్ కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదమైంది.