దర్శకుడు కొరటాల శివకు `సుప్రీం’లో చుక్కెదురు

స్టార్ దర్శకుడు కొరటాల శివకి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ‘శ్రీమంతుడు’ సినిమా కథ వివాదంలో ఉచ్చు బిగిసింది. స్థానిక కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దర్శకుడు కొరటాల శివ క్రిమినల్ కేసుల్ని ఎదుర్కోవల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్ఠం చేసింది.
 
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా 2015లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించగా కొరటాల దర్శకత్వం వహించారు. పుట్టిపెరిగిన పల్లెపై కోపంతో పట్టణం వచ్చి శ్రీమంతుడిగా మారిన తండ్రి హర్ష (జగపతిబాబు). తన మూలాలు వెతుక్కుంటూ పట్టణాన్ని వదిలి పల్లెకు వెళ్లిన కొడుకు హర్ష (మహేష్ బాబు). 
 
ఈ తండ్రీ కొడుకుల జీవితాల మధ్య ఊరు దత్తత అనే సామాజిక అంశాన్ని మిళితం చేసిన కథే ‘శ్రీమంతుడు’ సినిమా.  అయితే ఈ సినిమా 2015లో విడుదల కాగా ఈ కథను దర్శకుడు కొరటాల కాపీ కొట్టారంటూ అప్పట్లో కోర్టుకెక్కారు రచయిత శరత్ చంద్ర.
 
 ‘శ్రీమంతుడు’ కథను స్వాతి వార పత్రికలో వచ్చిన కథ ఆధారంగా కాపీ చేశారని అప్పట్లో హైదరాబాద్ నాంపల్లి కోర్టుని ఆశ్రయమించాడు రచయిత శరత్ చంద్ర.  పిటీషనర్ వాదనతో ఏకీభవించిన కోర్టు దర్శకుడు కొరటాల శివపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టుకి వెళ్లారు కొరటాల.

తన కథను కొరటాల కాపీ చేసేశారని పూర్తి ఆధారాలను కోర్టుకి సమర్పించారు రచయిత శరత్ చంద్ర. దీంతో కిందిస్థాయి కోర్టు తీర్పును సమర్దిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వెనక్కి తగ్గని కొరటాల సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణల అనంతరం సర్వోత్తన న్యాయస్థానం హైకోర్టు, స్థానిక కోర్టుల తీర్పులతోనే ఏకీభవిస్తూ తీర్పు చెప్పింది. 

 
కొరటాల పిటిషన్‌ను పరిగణలోకి తీసుకోలేమని, ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోకపోతే డిస్మిస్ చేయాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించడంతో దర్శకుడు కొరటాల ప్రయత్నాలు కోర్టులో ఫలించలేదు. కాబట్టి ‘శ్రీమంతుడు’ కథ కాపీ ఇష్యూలో కొరటాలపై క్రిమినల్ చర్యలు తప్పవు.

కాగా కొరటాల కథలను కాపీ కొడతారనే వివాదం ఒక్క శ్రీమంతుడు సినిమా అప్పుడే కాదు. ‘ఆచార్య’ సినిమా అప్పుడు కూడా ఇదే వివాదం నడిచింది. తన కథను కాపీ కొట్టారంటూ ఓ రైటర్ మీడియాకి ఎక్కడంతో తాను కాపీ చేయలేదంటూ కొరటాల వివరణ ఇచ్చారు. అయితే ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తన కథ కాపీ కొట్టారన్న రచయిత కూడా తరువాత సైలెంట్ అయిపోయాడు.