
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ రికార్డుస్ధాయిలో తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మద్దతుతో మళ్లీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన నితీష్ కుమార్‌తో పాటు, నూతన బిహార్ బృందాన్ని మోదీ అభినందించారు. బీజేపీకి చెందిన సమ్రాట్ చౌధురి, విజయ్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.
బిహార్‌లో నూతనంగా కొలువుతీరిన ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడుచుకోకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తుందని మోదీ ఎక్స్ వేదికగా ఆకాంక్షించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీష్ కుమార్, డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన సమ్రాట్ చౌధురి, విజయ్ సిన్హాలకు అభినందనలని పేర్కొన్నారు. ఈ బృందం రాష్ట్రంలోని తన కుటుంబసభ్యులకు అంకితభావంతో సేవలందిస్తుందనే విశ్వాసం తనకు ఉందని ప్రధాని హిందీలో ట్వీట్ చేశారు.
తమ పార్టీ సభ్యులు జేడీయుతో పొత్తు పట్ల సుముఖంగా లేరని, అందుకనే మహాగతబంధన్ నుండి బైటకు వచ్చామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం నితీష్ కుమార్ తెలిపారు. జనతాదళ్ యునైటెడ్ ఎప్పుడూ బీహార్, బీహార్ ప్రజల అభివృద్ధికోసమే పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఈ విషయంలో మధ్యలో కొన్ని అపోహలకు గురయ్యామని, నేడు తిరిగి అసలైన పొత్తులోకి వచ్చామని సంతోషం వ్యక్తం చేశారు.
బీహార్ లో మొత్తం 40 లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం బిజెపి శాసనసభాపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు. 2020లో లాలూ కుటుంబాన్ని ఓడించామని, భవిష్యత్ లో తిరిగి ఓడిస్తామని స్పష్టం చేశారు.
More Stories
వరల్డ్ ఆడియో విజువల్ సదస్సుపై ప్రధాని మోదీ భేటీ
అభివృద్ధి, సుపరిపాలనే గెలిచింది
ఢిల్లీలో ఆప్ ఓటమికి కేజ్రీవాల్ కారణం