ప్రస్తుత కాలానికి అనుగుణంగా చట్టాలను ఆధునికీకరిస్తున్నామని చెబుతూ నేడు మారుతున్న ఈ చట్టాలు రేపటి భారత దేశాన్ని మరింత బలోపేతం చేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో ఆదివారం జరిగిన సుప్రీంకోర్టు వజ్రోత్సవ (75వ వార్షికోత్సవం) వేడుకలను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్ట్స్(డీజీ ఎస్సీఆర్), డిజిటల్ కోర్ట్స్ 2.0, సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్‌లను ప్రధాని ప్రారంభించారు.
అనంతరం మోదీ మాట్లాడుతూ ఇటీవల తీసుకువచ్చిన మూడు కొత్త నేర న్యాయ చట్టాలతో దేశ న్యాయ, పోలీసింగ్, విచారణ వ్యవస్థలు సరికొత్త యుగంలోకి ప్రవేశిస్తాయని తెలిపారు. వందల ఏళ్లనాటి చట్టాల నుంచి కొత్త చట్టాలకు మారుతున్న క్రమంలో ఈ ప్రక్రియ సజావుగా ఉండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యమని సూచించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సామర్థ్యం పెంపుదల, చట్టాలపై అవగాహనకు సంబంధించిన శిక్షణను ప్రారంభించినట్టు చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కూడా ముందుకు రావాలని, న్యాయవ్యవస్థలోని అన్ని విభాగాల సామర్థ్యాలను పెంచేందుకు సహకరించాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. విశ్వసనీయమైన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తూ అనేక నిర్ణయాలు తీసుకుంటోందని వెల్లడించారు. ‘జన్ విశ్వాస్’ బిల్లు ఈ రూపంలో వచ్చిందేనని, దీనివల్ల న్యాయవ్యవస్థపై పడుతున్న అనవసరపు భారాన్ని తగ్గిపోతుందని చెప్పారు.
‘‘మధ్యవర్తిత్వ చట్టంతో న్యాయస్థానాలపై భారం తగ్గుతుంది. ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగాన్ని మెరుగుపరుస్తుంది’’ అని ప్రధాని తెలిపారు. సుప్రీంకోర్టు భవనాల విస్తరణ, మౌలిక సదుపాయాలకు సంబంధించి రూ.800 కోట్ల పనులకు గత వారమే ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు.
అయితే, కొత్త పార్లమెంటు భవనంపై పిటిషన్లు వేసినట్టుగా సుప్రీంకోర్టు మౌలిక సదుపాయాల కల్పనను సవాల్ చేస్తూ ఎవరూ పిటిషన్ వేయరని భావిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు నిర్ణయాలు డిజిటల్ రూపంలో అందుబాటులోకి రావడం, తీర్పులు స్థానిక భాషల్లో అనువదించే ఏర్పాటు చేయడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ తరహా ఏర్పాట్లు దేశవ్యాప్తంగా ఇతర కోర్టుల్లోనూ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
న్యాయ వ్యవస్థలో ప్రొఫెషనలిజం రావాలి
న్యాయ వ్యవస్థలో వాయిదాల సంస్కృతి పోయి వృత్తి నైపుణ్యంతో (ప్రొఫెషనలిజం) కూడిన సంస్కృతి రావాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ చెప్పారు. సంస్థాగత మార్పులపై చర్చలు జరగాల్సిన అవసరముందని పేర్కొంటూ కోర్టుల పనితీరు, విచారణ ప్రాచీన పద్ధతుల్లో ఉండటం.. మొదలైనవి సవాళ్లుగా గుర్తించామని, వీటిపై చర్చిస్తున్నామని ఆయన తెలిపారు.
More Stories
బొగ్గు స్థానంలో క్లీన్ ఎనర్జీ సాధ్యమా?
చైనా జలవిద్యుత్ విస్తరణను సవాల్ చేస్తున్న టిబెట్ నమూనా!
కర్ణాటక మాజీ సీఎం ఎస్ఎం కృష్ణ కన్నుమూత